- పని ఒత్తిడి తగ్గించేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలి
- సర్ పై సుప్రీంకోర్టు
- బూత్ స్థాయి అధికారుల ఆత్మహత్య ఘటనలపై స్పందించిన సుప్రీంకోర్టు
- గడువులోగా సర్ ను పూర్తి చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ, మహా : ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారుల ఆత్మహత్య ఘటనలు జరగడంపై సుప్రీంకోర్టు స్పందించింది. పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదురైనప్పుడు అదనపు సిబ్బందిని నియామించుకోవాలని అన్ని రాష్ట్రాలను సూచించింది. ఎస్ఐఆర్ను గడువులోని పూర్తి చేయాలని ఈసీ బూత్ స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తోందన్న పిటిషన్‌పై సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. పని ఒత్తిడి కారణంగా బూత్ స్థాయి అధికారులు రాజీనామా చేయడంతో పాటు పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషనర్ తరుపున న్యాయవాది కోర్టుకు వివరించారు. గడువులోగా పని పూర్తి కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎన్నికల సంఘం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘంతో కలిసి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వర్క్‌లోడ్ కారణంగా అధికారులు ఇబ్బంది పడుతుంటే అదనపు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఉద్యోగికైనా ఎస్ఐఆర్ విధుల నుంచి మినహాయింపు కావాలని ఏదైనా కారణం చూపిస్తే వేరే ఉద్యోగిని ప్రత్యామ్నాయంగా నియమించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.






