కొత్త ప్రమాదం.
* జైషే మహ్మద్ మహిళా వింగ్ ఏర్పాటు.
* ఆత్మాహుతి దళంగా శిక్షణ.
* దాడులకు ఐదు వేల మంది మహిళలకు ట్రైనింగ్.
* ఇస్లామిక్ బోధనల పేరుతో బ్రెయిన్ వాష్.
* శత్రువుల ప్రతిఘటనకు వ్యూహాత్మక జవాబు.
* భద్రతా సంస్థలకు కొత్త సవాలు.
న్యూ ఢిల్లీ, మహా.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, తన ఉనికిని, దాడుల సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు ప్రమాదకరమైన కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈ సంస్థ తమ కార్యకలాపాలలో మహిళలను భాగస్వామ్యం చేయడానికి తొలిసారిగా ప్రత్యేక మహిళా విభాగాన్ని ప్రారంభించింది. ఇది ప్రాంతీయ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా, భారత్ వంటి దేశాలపై దాడులు చేసేందుకు మహిళా ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్టు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
* మహిళా విభాగానికి కీలక నేతృత్వం*
జైషే మహ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో ఈ కొత్త మహిళా విభాగం ‘జమాత్-ఉల్-మొమినాత్’ పేరుతో ఏర్పాటైంది. ఈ నిర్ణయం ఉగ్రవాద కార్యకలాపాలలో మహిళల పాత్రను పెంచేందుకు జె ఏ ఎం తీసుకున్న వ్యూహాత్మక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త వింగ్ ఏర్పాటు ద్వారా, సాంప్రదాయక పద్ధతులకు భిన్నంగా, సంస్థ తన రిక్రూట్‌మెంట్ మరియు ఆపరేషన్లను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* ఆత్మాహుతి దాడులకు ఐదు వేల మంది మహిళలకు శిక్షణ*
మసూద్ అజార్ సోషల్ మీడియా పోస్టులు, ఆడియో సందేశాల ద్వారా ఈ మహిళా వింగ్ కార్యకలాపాలను వెల్లడించాడు. ఇటీవల కాలంలో 5,000 మందికి పైగా మహిళలు ఈ వింగ్‌లో చేరారని, వారికి ఆత్మాహుతి దాడులతో సహా వివిధ కార్యకలాపాల కోసం శిక్షణ ఇస్తున్నామని ఆయన ప్రకటించాడు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతమంతటా జిల్లా స్థాయిలో సంస్థాగత ఏర్పాట్లు చేయాలని జైష్ చీఫ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో ఒక మహిళా అధిపతి (ముంతాజియా) నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయం ఉంటుందని సమాచారం.
ఇస్లామిక్ బోధనల పేరుతో బ్రెయిన్ వాష్
జైష్ మహిళల్ని రిక్రూట్ చేసుకోవడానికి మతపరమైన భావోద్వేగాలను ఉపయోగించుకుంటోంది. మసూద్ అజార్ ఆడియో ప్రసంగాలలో, సంస్థలో చేరిన మహిళలు మరణానంతరం నేరుగా స్వర్గానికి వెళ్తారని నమ్మబలికి, వారిని ‘జిహాద్’ కోసం ప్రేరేపిస్తున్నాడు. జె ఈ యం పురుష రిక్రూట్‌లకు ఇచ్చే ‘దౌరా-ఎ-తర్బియాత్’ తరహాలో, మహిళలకు ‘దౌరా-ఎ-తస్కియా’ అనే ప్రత్యేక ప్రేరణా శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పేదరికం, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారికి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారు.
శత్రువుల ప్రతిఘటనకు వ్యూహాత్మక జవాబు
భారత సైన్యంలో హిందూ మహిళలు చేరడం మరియు మహిళా జర్నలిస్టుల ద్వారా తమపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందనే కారణాలను చూపిస్తూ, దానికి ప్రతిఘటనగా మహిళల్ని ఉగ్రవాదంలోకి తీసుకుంటున్నట్లు మసూద్ అజార్ తన ప్రసంగాలలో పేర్కొన్నాడు. జైష్‌కి ఇటీవల కాలంలో ఎదురైన నష్టా నేపథ్యంలో, తమ కార్యకలాపాలను మళ్లీ పుంజుకునేందుకు, మరింత విస్తరించేందుకు ఈ మహిళా వింగ్‌ను ఒక కొత్త, కనిపెట్టడానికి కష్టమైన మార్గంగా వినియోగించాలని ఉగ్ర సంస్థ యోచిస్తోంది.
భద్రతా సంస్థలకు కొత్త సవాలు
జైషే మహ్మద్ ఈ కొత్త వ్యూహాన్ని అవలంబించడం ద్వారా, ఐసిస్, బోకో హరామ్ వంటి సంస్థలు గతంలో ఉపయోగించిన పద్ధతులను అనుకరిస్తున్నట్లు భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సాంప్రదాయకంగా మహిళలు ఉగ్ర దాడులలో పాల్గొనడం తక్కువగా ఉండటం వలన, వారిని ఉపయోగించడం ద్వారా నిఘా వర్గాలను తప్పించుకోవచ్చని ఉగ్రవాదులు భావిస్తున్నారు. మహిళా ఉగ్రవాదుల పెరుగుదల, ప్రాంతీయ భద్రత, సరిహద్దుల వద్ద నిఘాకు కొత్త, క్లిష్టమైన సవాలుగా పరిణమిస్తోంది.






