సర్కారీ బడిలో సరికొత్త ‘టెన్షన్’.
* టీచర్ల ‘డుమ్మా’కు ఎఫ్ఆర్ఎస్ అడ్డుకట్ట.
* 30 రోజులు గైర్హాజరైతే ఉద్యోగం కోల్పోవాల్సిందే.
* లక్షా పదివేల మంది టీచర్లపై విద్యాశాఖ ‘ఉక్కుపాదం’!
* విద్యార్థుల భవితవ్యం కోసం కఠిన వైఖరి.. 50 మంది తొలగింపు!
* ఖమ్మం జిల్లాల్లో మిగులు టీచర్లు..అటు ‘డుమ్మా’ ఇటు ‘కొరత’.
* గురువుల నిర్లక్ష్యానికి సాంకేతికతతో సంకెళ్లు.
* విద్యావ్యవస్థలో సంస్కరణల పర్వం.
ఖమ్మం బ్యూరో, మహా.
రాష్ట్రంలోని సుమారు లక్షా పదివేల మంది సర్కారు స్కూల్ టీచర్లలో కొందరు ప్రదర్శిస్తున్న బాధ్యతారాహిత్యం, ప్రభుత్వ విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. నెలల తరబడి ముందస్తు అనుమతి లేకుండా తరగతి గదులకు డుమ్మా కొట్టడం వల్ల అనేక పాఠశాలల్లో కీలకమైన సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడి, లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ తీవ్ర సమస్యకు చెక్ పెట్టడానికి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనే సాంకేతిక అస్త్రాన్ని వినియోగించి, విద్యారంగంలో ఒక చారిత్రక ప్రక్షాళనకు తెరలేపింది. ఈ వ్యవస్థ ద్వారా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండటానికి విద్యాశాఖ ఇచ్చిన చివరి హెచ్చరిక ఇది. ముప్పై రోజులు గైర్హాజరైతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందనే కఠిన నిర్ణయం, రాష్ట్రంలోని 24 వేల ప్రభుత్వ పాఠశాలల వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది.
* 30 రోజులు గైర్హాజరైతే తక్షణమే షోకాజ్ నోటీసులు*
ప్రభుత్వ పాఠశాలల్లోని హాజరు సమస్యను తీవ్రంగా పరిగణించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్, ఇకపై టీచర్లు ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా 30 రోజులు వరుసగా స్కూల్కు రాకపోతే, వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన డీఈఓల సమావేశంలో డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ మేరకు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ నోటీసులకు సంబంధిత టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. సరైన కారణం లేకుండా విధులకు డుమ్మా కొట్టినట్లు తేలితే, శాఖాపరమైన చర్యలు, చివరికి సర్వీసు నుంచి తొలగింపు తప్పదని విద్యాశాఖ హెచ్చరిస్తోంది.
* డుమ్మా టీచర్లకు తప్పని శిక్ష*
గతంలో ఉపాధ్యాయుల అటెండెన్స్ వివరాలను రిజిస్టర్ల ద్వారా తెలుసుకునేందుకు హెడ్మాస్టర్, ఎంఈఓ, డీఈఓల మధ్య సమాచారాన్ని సేకరించడానికి చాలా సమయం పట్టేది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఎఫ్ఆర్ఎస్ విధానంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సాంకేతిక వ్యవస్థతో ఎవరెవరు రెగ్యులర్గా రావడం లేదనేది క్షణాల్లో గుర్తించే అవకాశం ఏర్పడింది. డుమ్మా కొడుతున్న టీచర్ల డేటాను స్టేట్ ఆఫీసు నుంచే అధికారులు ప్రతినెలా క్రోడీకరించి ఆయా జిల్లాల డీఈఓలకు పంపిస్తున్నారు. ఈ కఠిన పర్యవేక్షణ కారణంగా బడుల్లో టీచర్ల హాజరు శాతం అనూహ్యంగా పెరిగింది.
ఖమ్మం జిల్లాల్లో మిగులు టీచర్ల సమస్య
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24,238 ప్రభుత్వ పాఠశాలల్లో, 1.08 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ గణాంకాలు ఒకవైపు ఉంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మరో సమస్య తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,269 సర్కారీ బడుల్లో 4,885 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉండాల్సిన దానికంటే ఏకంగా 1,521 మంది అదనంగా (మిగులు) ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు కొన్ని బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థులను వేధిస్తుంటే, మరోవైపు ఖమ్మం వంటి జిల్లాల్లో ఇంత పెద్ద సంఖ్యలో మిగులు ఉపాధ్యాయులు ఉండటం విద్యా వ్యవస్థ ముందున్న పెద్ద సవాలును ఎత్తి చూపుతోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలో భారీ స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.
గతంలో 50 మంది తొలగింపు ఉదంతం పునరావృతం కాకూడదు
విద్యాశాఖ తన నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎంత కఠినంగా ఉంటుందో గత ఉదంతాలు నిరూపిస్తున్నాయి. గత రెండేండ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని దాదాపు 50 మంది టీచర్లను విద్యాశాఖ సర్వీసు నుంచి తొలగించింది. భవిష్యత్తులోనూ ఇదే కఠిన వైఖరి కొనసాగుతుందని, టీచర్లు తమ విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల పాఠశాల విద్య మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థులు మెరుగైన విద్యను అందుకుంటారని విద్యా వేత్తలు విశ్వసిస్తున్నారు.






