Mahaa Daily Exclusive

  మంటల్లో మాడుతున్న బీసీ నినాదం..* మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి అఘాయిత్యం!

Share

మంటల్లో మాడుతున్న బీసీ నినాదం..
* మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి అఘాయిత్యం!
* 42 శాతం కోటా ఏదీ?.. కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరుగుతూ యువకుడి ఆత్మహత్యాయత్నం.
* మల్లన్న కలవలేదని మనస్తాపం..
* ఆఫీస్ గేటు ముందే అగ్నిప్రమాదం.. సాయి పరిస్థితి విషమం!

హైదరాబాద్ , మహా.

రాజకీయ హామీలు నెరవేరడం లేదన్న ఆవేదన, తమ వర్గానికి అన్యాయం జరుగుతుందన్న ఆక్రోశం ఓ యువకుడిని మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లింది. హైదరాబాద్ వేదికగా గురువారం సాయంత్రం గుండెలు పిండే విషాదం చోటుచేసుకుంది. బీసీలకు దక్కాల్సిన 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, తమను ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేసిందని ఆరోపిస్తూ సాయి అనే యువకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం (క్యూ న్యూస్) సాక్షిగా ఒంటికి నిప్పంటించుకున్నాడు.
తన బాధను చెప్పుకునేందుకు, బీసీల హక్కుల కోసం పోరాటం చేయమని కోరేందుకు సాయి ఎంతో ఆశతో మల్లన్న ఆఫీస్ మెట్లు ఎక్కాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ సమయానికి మల్లన్న కార్యాలయంలో లేరు. సిబ్బంది రేపు రావాలని సర్దిచెప్పి పంపించినప్పటికీ, తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన సాయి కిందకు దిగి క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు, సిబ్బంది షాక్ కు గురయ్యారు.
వెంటనే తేరుకున్న స్థానికులు మంటలు ఆర్పి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఆయన మృత్యువుతో పోరాడుతున్నాడు. శరీరం కాలిపోయి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి బయలుదేరి బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లారు. రిజర్వేషన్ల కోసం ఒక యువకుడు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Latest