Mahaa Daily Exclusive

  ఢిల్లీ వేదికగా తెలంగాణ రహదారుల ప్రస్తావన..

Share

ఢిల్లీ వేదికగా తెలంగాణ రహదారుల ప్రస్తావన..
* పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతి పత్రం.
* గడ్కరీకి వద్దిరాజు రవిచంద్ర కీలక విజ్ఞప్తి.
ఖమ్మం, మహా.
తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా గురువారం ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల అంశం పార్లమెంట్ ప్రాంగణంలో చర్చకు వచ్చింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గురువారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌లోని కేంద్ర మంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన రోడ్డు రవాణా అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర కేంద్ర మంత్రికి ప్రత్యేక విజ్ఞాపన పత్రాలను అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా మంజూరై, వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల పనులకు తక్షణమే నిధులు కేటాయించాలని ఆయన కోరారు. నిధుల కొరత వల్ల పలుచోట్ల పనులు మందకొడిగా సాగుతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా, నిధుల విడుదలలో వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రహదారుల పనులను కూడా వేగవంతం చేసి, త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వద్దిరాజు రవిచంద్ర కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని ఆయన నొక్కిచెప్పారు. తెలంగాణలో రహదారుల ఆవశ్యకతను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రగతికి జీవనాడిగా నిలిచే జాతీయ రహదారుల విషయంలో బీఆర్ఎస్ ఎంపీ చేసిన ఈ విజ్ఞప్తి ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest