Mahaa Daily Exclusive

  ఇండిగో విమాన సంక్షోభం: ప్రయాణికుల అగచాట్లు

Share

  • మూడవ రోజు కొనసాగిన ఇండిగో సంక్షోభం
  • శుక్రవారం 400 విమానాలు రద్దు
  • విమానాశ్రయాల్లోనే ప్రయాణీకుల ఆందోళనలు
  • వసతులు కల్పించకపోవడంతో అక్కడే నిద్ర
  • మందులు లేక వృద్ధులు… పిల్లలు విలవిల
  • ప్రత్యామ్నాయ చర్యలపై ఇండిగో నిర్లక్ష్యం
  • రోజుకో కుంటి సాగు చెబుతున్న బడా సంస్థ

మహా : దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం, చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ అందిస్తుంటే ప్రయాణికులను మనుషులుగా చూస్తున్నట్టు అనుకోవచ్చా అనన అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

క్షమాపణ చెబితే సరిపోతుందా?

కంపెనీ యాజమాన్యం ఒక చిన్న ప్రకటన విడుదల చేసి ‘క్షమించండి’ అని చెప్పి చేతులు దులుపుకుంది. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు. కానీ నాలుగు రోజులుగా ఒక్క మార్పు కూడా కనిపించడం లేదు. విమానాలు రద్దు కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు కౌంటర్ల వద్ద సిబ్బందిని నిలదీస్తున్నా వారు నవ్వుతూ తప్పించుకుంటున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం చేసే బడా సంస్థ బాధ్యత ఇదేనా? కనీస స్పందన లేకుండా ప్రయాణికులను గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

డబ్బులు లేవు… హోటల్ లేదు… సీటు లేదు!

విమానం రద్దు అయిన ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. వేరే విమానంలో ప్రత్యామ్నాయ సీటు కల్పించడం లేదు. కనీసం రాత్రి గడపడానికి ఒక హోటల్ కూడా ఏర్పాటు చేయడం లేదు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు విమానాశ్రయాలలో నేలపైనే పడుకుని రాత్రంతా అల్లాడిపోయారు. మందులు వాడాల్సిన వృద్ధులు సరైన సమయంలో ఔషధాలు తీసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ కష్టాలన్నీ ఇండిగో కళ్ల ముందే కనిపిస్తున్నా ఆ కంపెనీకి చీమ కుట్టినట్టు కూడా లేదు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ సంస్థపై ఎవరు చర్య తీసుకుంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రోజుకో కొత్త కారణం

విమానాల రద్దుకు సిబ్బందికి శిక్షణ, కొత్త సాఫ్ట్‌వేర్, వాతావరణం బాగోలేకపోవడం అంటూ యాజమాన్యం రోజుకో కొత్త కారణం చెబుతోంది. ఇవన్నీ సాకులు తప్ప మరొకటి కాదు. నిజం మాత్రం ఒక్కటే ఇండిగో అతివేగంగా విస్తరించింది. కానీ ఆ స్థాయి విమానాలను, సిబ్బందిని సమర్థవంతంగా నిర్వహించే శక్తిని అది కోల్పోయింది. కంపెనీ చేసిన ఈ తప్పుకు మూల్యం ప్రయాణికులు చెల్లించుకోవాల్సి వస్తోంది. తమ వైఫల్యాన్ని ఒప్పుకునే దమ్ము ఇండిగోకి లేకపోవడం దురదృష్టకరం.

ప్రభుత్వ మౌనం దేనికి సంకేతం

వందలాది విమానాలు రద్దు అయినా, లక్షలాది మంది ప్రయాణికులు నష్టపోయినా కేంద్ర విమానయాన మంత్రి కానీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ నోరు మెదపడం లేదు. ఇండిగోకి జరిమానా వేయడం, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డబ్బు ఉంటే దేన్నైనా మేనేజ్ చేయవచ్చు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సామాన్యుడి కష్టాన్ని పట్టించుకోకుండా విమానయాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చివరకు దిగొచ్చిన డీజీసీఏ… పైలట్లకు 48 గంటల రెస్ట్ నిబంధన ఉపసంహరణ

ఇండిగో సంక్షోభంతో దిగొచ్చిన డీజీసీఏ పైలట్లకు 48 గంటల రెస్ట్ నిబంధన ఉపసంహరించుకుంది. ఇండిగో విమానాల రద్దుతో పైలట్లకు 48 గంటల రెస్ట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో పాటు విమాన క్రూ, ఫ్లైట్ రోస్టర్ నిబంధనలు కూడా సడలించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్ డీటీఎల్) పేరుతో పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసిన విషయం తెలిసిందే. దీంతో పైలట్ల కొరత ఏర్పడి రెండు రోజులుగా భారీగా ఇండిగో సంస్థ తన విమానాలను రద్దు చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో 48 గంటల విశ్రాంతి నిబంధనతో పాటు.. పైలట్లకు వారంపాటు విశ్రాంతి నిబంధనను డీజీసీఏ ఎత్తివేసింది. డీజీసీఏ కొత్త నిబంధనతో ఇండిగో ఆపరేషన్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు కిక్కిరిసిన ప్రయాణికులతో రైల్వేస్టేష న్లను తలపిస్తున్నాయి. 12-14 గంటలుగా నీళ్లు, భోజనం లేక వేచిచూసే ప్రయా ణికులు కోపంతో, బిక్కుబిక్కుమంటూ ఇండిగో కౌంటర్ల ముందు వేచి చూస్తున్నారు.

ఇండిగో క్రూ కొరత, టెక్ సమస్యలు, కొత్త నైట్ డ్యూటీ నిబంధనలపై తప్పుడు అంచనాలు.. ఇవన్నీ కలిసిపోవడంతో ఆపరేషన్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎయిర్ లైన్స్ అంగీకరించింది. డిసెంబర్ 8 నుంచి ఫ్లైట్ల సంఖ్య తగ్గిస్తూ షెడ్యూల్ స్టబిలైజేషన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. “రెండు రోజులుగా మా నెట్ వర్క్ అంతటా భారీ అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రభావితులైన అందరికీ క్షమాపణలు,” అని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అయితే విమానాశ్రయాల్లో ప్రయాణికుల బాధలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.