Mahaa Daily Exclusive

  తెలంగాణ భూములపై ‘నిషేధిత’ బాంబు..! కోటి ఎకరాలకు సర్కార్ సంకెళ్లు..!

Share

  • తెలంగాణ భూములపై ‘నిషేధిత’ బాంబు.
  •  కోటి ఎకరాలకు సర్కార్ సంకెళ్లు!
  •  అక్రమార్కులకు రెడ్ కార్పెట్.. అన్నదాతకు ఉరితాడు.. 22-ఏ జాబితాలో భారీ దందా?
  •  రెవెన్యూ శాఖ ‘మాయ’జాలం.. సామాన్యుడి భూమి ‘ప్రభుత్వ’ ఖాతాలో జమ!
  •   హైకోర్టు మొట్టికాయలు వేసినా మారని తీరు..
  • తెలంగాణలో భూ యజమానుల ఆగ్రహజ్వాల
  •  భూమాత సాక్షిగా మహా మోసం: 10 వేల గ్రామాల్లో రైతుల ఆర్తనాదాలు
  •  రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి కోటి ఎకరాలు.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్!

 

ఖమ్మం బ్యూరో, మహా.

 

తెలంగాణ రైతాంగం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కష్టపడి సంపాదించుకున్న భూమి, వారసత్వంగా వచ్చిన ఆస్తి.. ఒకే ఒక్క సంతకంతో, ఒకే ఒక్క క్లిక్‌తో ‘నిషేధిత’ జాబితాలోకి వెళ్ళిపోతే ఆ యజమాని పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఆందోళన నెలకొంది. భూముల ప్రక్షాళన పేరుతో, కోర్టు ఆదేశాల అమలు సాకుతో రెవెన్యూ యంత్రాంగం చేసిన పని ఇప్పుడు సామాన్యుడి పాలిట శాపంగా మారింది. దాదాపు కోటి ఎకరాల భూములను 22-ఏ (నిషేధిత) జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో పెను సంచలనానికి, తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీని వెనుక అసలు జరిగిందేమిటి? ఇది పరిపాలనా వైఫల్యమా లేక పథకం ప్రకారం జరిగిన కుట్రా?

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూముల వ్యవహారం ఇప్పుడు అగ్నిపర్వతంలా మారుతోంది. తమకు తెలియకుండానే తమ భూములు ప్రభుత్వ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయని తెలుసుకున్న రైతులు, ప్లాట్ల యజమానులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 2.53 కోట్ల ఎకరాల భూమిలో.. దాదాపు కోటి ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం ‘సెక్షన్ 22-ఏ’ కింద నిషేధిత జాబితాలో చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే రాష్ట్రంలోని దాదాపు 40 శాతం భూములపై ఇక ఎటువంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగవు. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగాన్నే కాకుండా, అత్యవసరాలకు భూమిని అమ్ముకుందామనుకున్న సామాన్య రైతు నడ్డి విరిచింది.

వాస్తవానికి ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నది 22-ఏ సెక్షన్ ముఖ్య ఉద్దేశం. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా, శాస్త్రీయమైన సర్వేలు చేయకుండా రెవెన్యూ అధికారులు గాలివాటంగా జాబితాలను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఐజీఆర్ఎస్ పోర్టల్‌లో వివరాలను అప్‌లోడ్ చేయాల్సి రావడంతో, గడువు లోపు పని ముగించాలన్న తొందరలో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టా భూములు, దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములు, ఎప్పుడో కన్వర్షన్ అయిన ప్లాట్లను కూడా గుడ్డిగా నిషేధిత జాబితాలో చేర్చడం రెవెన్యూ శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట.

మరోవైపు ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్ వంటి అత్యంత విలువైన భూములున్న జిల్లాల్లో రాజకీయ నాయకులు, బడా బాబులు చక్రం తిప్పారని సమాచారం. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన కొందరు అక్రమార్కులు, అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టచెప్పి తమ భూములను ఈ జాబితా నుండి తప్పించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ, ఎటువంటి రాజకీయ అండదండలు లేని మధ్యతరగతి ప్రజలు, అమాయక రైతుల భూములు మాత్రం అకారణంగా ఈ జాబితాలోకి నెట్టబడ్డాయి. ఇప్పుడు తమ భూమిని నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురావాలంటే మళ్ళీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, లక్షల్లో లంచాలు ఇవ్వాలి.. ఇదే ఇప్పుడు సామాన్యుడిని వేధిస్తున్న సమస్య.

హైకోర్టు మొట్టికాయలు వేసినా రెవెన్యూ శాఖ తీరు మారలేదు. గతంలోనే పారదర్శకత పాటించాలని, ప్రజలకు అందుబాటులో వివరాలు ఉంచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. డిసెంబర్ 3న హడావిడిగా ఐజీఆర్ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన ఈ జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. కొన్ని జిల్లాల్లో 100 శాతం అప్‌లోడ్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, ఆ జాబితాలో దొర్లిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుకుంటున్నారు. పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన భూమిని కూడా నిషేధిత జాబితాలో పెడితే, ఇక ఆ రైతుకు దిక్కెవరు? ఆడబిడ్డ పెళ్లి కోసమో, అనారోగ్య చికిత్స కోసమో భూమి అమ్ముకుందామంటే.. ‘మీ భూమి బ్లాక్ లిస్టులో ఉంది’ అని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమాధానం వస్తుంటే గుండె ఆగిపోయినంత పనవుతోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన జాబితాలను పక్కన పెట్టి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. రాజకీయ కక్ష సాధింపులకు, అవినీతికి 22-ఏ సెక్షన్‌ను ఆయుధంగా వాడుకోవడం మానేయాలి. లేదంటే, ఈ భూముల చిచ్చు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం ఉంది. అక్రమార్కుల భూములను రక్షించి, అన్నదాత భూములను బంధించడం ఏ రకమైన ప్రజాపాలనో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

 

రెవెన్యూ శాఖ చేసిన ఈ తప్పుల తడకల జాబితా సవరించబడకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కోర్టులన్నీ భూ వివాద కేసులతోనే నిండిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంది.

Latest