- చికిత్స పొందుతూ సాయి ఈశ్వరా చారి మృతి
- గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత .. బీసీ సంఘాలు, నేతల ధర్నా
హైదరాబాద్ సిటీ, మహా : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ సర్కిల్ క్యూ న్యూస్ కార్యాలయం ఎదురుగా వరంగల్ రహదారిపై గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సాయి ఈశ్వరా చారి శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య కుక్కల కవిత (28) మేడిపల్లి పోలీసులకు తన భర్త సాయి ఈశ్వర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బీసీలకు 42% రిజర్వేషన్‌పై వీడియోలు చూసేవాడని, గురువారం తనకు ఫోన్లో క్యూ న్యూస్ కార్యాలయం ఎదురుగా తన భర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని సమాచారం రావడంతో ఆసుపత్రికి చేరుకున్నానని ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా సాయి ఈశ్వర్ మృతికి ప్రభుత్వమే కారణమంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్, తెలంగాణ జాగృతి అధినేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా రావాల్సిందేనని, అందుకోసం కొట్లాడుతామన్నారు.
…..






