- సినిమా పట్ల సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలి
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- సావిత్రి లాంటి మహానటికి మరణం లేదు
- మంచి సినిమాల ద్వారా సమాజంలో మంచిని పెంచాలి
హైదరాబాద్, మహా: సినిమాల పట్ల సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలని, ఇందు కోసం సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని సంగమం ఫౌండేషన్ వారికి, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సంయుక్తంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన “సావిత్రి మహోత్సవ్” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహానటి నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ లతో పాటు సావిత్రి క్లాసికల్స్ పుస్తక రూపకర్త సంజయ్ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను ఆయన సత్కరించారు.
సావిత్రి 90వ జయంతి సందర్భంగా ఆమె స్మృతికి నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు, అలాంటి మహానటికి మరణం లేదన్నారు. కంటి కొనచూపుతోనే నవరసాలను నవ నవోన్మేషంగా పలికించే ఆమె ఒక సాధికారిక నట సర్వస్వం అని పేర్కొన్నారు. సావిత్రి జీవితం నుంచి ఈతరం యువత నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయన్న ఆయన, నటిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని తెలిపారు. ప్రస్తుతం సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత తగ్గిపోతోందని, కుటుంబ విలువలున్న సినిమాలు రావడం లేదని, దర్శక నిర్మాతలు ఈ దిశగా ఆలోచించకపోతే సమాజంలో సినిమా పట్ల సానుకూల దృక్పథం తగ్గే ప్రమాదముందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అగ్రనిర్మాతలు ముందుకు రావాలని సూచించారు.
అతి చౌకగా లభించే వినోద సాధనమైన సినిమా కళాత్మక వ్యాపారం అన్న వెంకయ్యనాయుడు, తెలుగు సాహితీ ప్రపంచంలోని కథలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే అమరావతి కథలు ధారావాహికలుగా ప్రసారం కావడం, ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా కథాసుధ పేరిట మంచి కథలు లఘు చిత్రాలుగా తెరకెక్కడం గురించి ప్రస్తావించిన ఆయన ఆగ్రనిర్మాతలు ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా “35 – చిన్న కథ కాదు”, “బలగం”, “కమిటీ కుర్రోళ్ళు”, “గాంధీతాత చెట్టు” సినిమాల గురించి ప్రస్తావించిన ఆయన, మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, అవార్డులు కూడా వెతుక్కుంటూ వస్తాయని, ఇలాంటి చిత్రాల ద్వారా మంచి నటుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అందుకే అగ్ర దర్శక నిర్మాతలు సాహిత్యం, కళల పరిరక్షణకు ఉపయోగపడే చిత్రాల మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. మంచి సినిమాల ద్వారా సమాజంలో మంచిని పెంచాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మురళీమోహన్, రోజా రమణి, తనికెళ్ళ భరణి, నన్నపనేని రాజకుమారి, బాలాదిత్య సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పాల్గొన్నారు.






