Mahaa Daily Exclusive

  మహాత్మా’ మాయం.. ‘విక్షిత్ భారత్’ కాయం!

Share

మహాత్మా’ మాయం.. ‘విక్షిత్ భారత్’ కాయం!
* గ్రామీణ ఉపాధి స్వరూపం మార్చేస్తున్న కేంద్రం
* కొత్త చట్టంతో 125 రోజుల పని పండుగ..
* మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
* పాత చట్టం రద్దు దిశగా పార్లమెంట్‌లో కొత్త బిల్లు!

ఢిల్లీ, మహా.

దేశంలోని గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేసిన అతిపెద్ద పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్‌ఈజీఏ) త్వరలోనే కనుమరుగు కాబోతోంది. గత రెండు దశాబ్దాలుగా కోట్లాది మంది కూలీలకు ఆసరాగా నిలిచిన ఈ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మరింత శక్తివంతమైన, కొత్త హంగులతో కూడిన మరో చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో సభ్యులకు అందించిన కొత్త బిల్లు ప్రతులు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పేరు మారడమే కాదు, పని దినాలు కూడా పెరగనున్నాయన్న వార్త గ్రామీణ భారతావనిలో ఆసక్తి రేపుతోంది.

*కొత్త చట్టంతో 125 రోజుల పని పండుగ*

దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం మంగళం పాడబోతోంది. అయితే కూలీలు ఆందోళన చెందాల్సిన పనిలేదు, ఎందుకంటే పాత చట్టం స్థానంలో మరింత ప్రయోజనకరమైన కొత్త చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన “విక్షిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్” బిల్లు ప్రతులను సోమవారం లోక్‌సభ సభ్యులకు పంపిణీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంజీఎన్ఆర్‌ఈజీఏ చట్టాన్ని రద్దు చేసి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యమే ధ్యేయంగా ఈ కొత్త చట్టాన్ని మోదీ ప్రభుత్వం రూపొందించింది.
ఈ కొత్త బిల్లులో గ్రామీణ కూలీలకు శుభవార్త ఉంది. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కేవలం 100 రోజుల పని దినాలు మాత్రమే కల్పించేవారు. కానీ కొత్తగా రాబోతున్న “జీ-రామ్-జీ” మిషన్ కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కచ్చితంగా 125 రోజుల పని దినాలను కల్పించాలని ప్రతిపాదించారు. అంటే అదనంగా మరో 25 రోజుల పని దొరకనుందన్నమాట. ఇది కరువు కోరల్లో చిక్కుకున్న గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం. గత కొద్ది రోజులుగా ఈ పథకానికి “పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన” అనే పేరు పెడతారని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా సభ్యులకు ఇచ్చిన బిల్లులో మాత్రం “విక్షిత్ భారత్” పేరుతోనే ఉండటం గమనార్హం.
ఈ మార్పు కేవలం పేరుకు, పని దినాలకు మాత్రమే పరిమితం కాలేదు. నిధుల కేటాయింపులోనూ కేంద్రం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పాత చట్టంలో కూలీల వేతనాల భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించేది. కానీ కొత్త బిల్లు ప్రకారం ఈ భారాన్ని కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం 60 శాతం నిధులు ఇస్తే, రాష్ట్రాలు 40 శాతం భరించాలి. అయితే ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలకు మాత్రం కేంద్రం 90 శాతం నిధులు సమకూరుస్తుంది. ఈ నిబంధన రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, రెండు దశాబ్దాల నాటి చట్టాన్ని రద్దు చేసి, 125 రోజుల పని దినాలతో కొత్త చట్టాన్ని తేవడం నిజంగానే ఒక సంచలన నిర్ణయం.

Latest