పసుపు రైతుల అభ్యున్నతే ధ్యేయం.
* విలువ జోడించిన ఉత్పత్తులే ముద్దు.
* పసుపు ధరల స్థిరత్వానికి పసుపు మండలి నడుం బిగించాలి.
* పసుపు సదస్సులో మంత్రి తుమ్మల దిశానిర్దేశం .
హైదరాబాద్, మహా.
పసుపును కేవలం పంటగా చూడకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ, మన సంస్కృతిలో అంతర్భాగమైన పసుపుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఔషధ రంగాలు మరియు పోషకాహార ఉత్పత్తుల్లో గిరాకీ పెరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వ్యవసాయ విజన్ 2047లో పసుపు సాగుకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించామని, దీని ద్వారా రైతులకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యమని వివరించారు.
నిజామాబాద్ మరియు ఆర్మూర్ ప్రాంతాల పసుపుకు ఉన్న విశిష్టతను గుర్తు చేస్తూ, ఆర్మూర్ పసుపుకు లభించిన భౌగోళిక గుర్తింపు తెలంగాణ రైతాంగానికి దక్కిన గౌరవమని మంత్రి కొనియాడారు. అయితే, సాగు ఖర్చులతో పోలిస్తే విపణిలో లభిస్తున్న ధరలు రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలను అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా పసుపు పండించడానికి రైతు సుమారు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేస్తుండగా, అమ్మకం ధర పన్నెండు వేల రూపాయల లోపే ఉండటం వల్ల రైతులకు ఆశించిన ప్రతిఫలం దక్కడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జాతీయ పసుపు మండలి కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, విపణి ధోరణులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ ధరల స్థిరత్వానికి పూచీ పడాలని సూచించారు.
రైతులు తమ పంటను కేవలం ముడి సరుకుగా కాకుండా, ప్రాసెసింగ్ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించాలని మంత్రి కోరారు. పసుపు నుండి తీసే రంగులు, ఔషధ గుణాలు కలిగిన పొడులు, సౌందర్య సాధనాల తయారీ ద్వారానే అధిక లాభాలు గడించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకోసం పసుపు శుద్ధి కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, ఆయిల్ పామ్ వంటి తోటల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పసుపును అంతర పంటగా సాగు చేయడం ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని సూచించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ పసుపును తీర్చిదిద్దేందుకు అత్యాధునిక నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శాస్త్రవేత్తలు పరిశోధనలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా, పొలాల వద్దకే తీసుకెళ్లి రైతులకు మేలైన వంగడాలను అందించాలని కోరారు. పారదర్శకమైన మార్కెట్ వ్యవస్థ, నాణ్యమైన తేమ కొలిచే యంత్రాల వాడకం ద్వారా పసుపు సాగులో కొత్త విప్లవాన్ని తీసుకువస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.








