Mahaa Daily Exclusive

  నితిన్ గడ్కరీతో ప్రియాంక గాంధీ భేటీ…..

Share

* నితిన్ గడ్కరీతో ప్రియాంక గాంధీ భేటీ.
* వాయనాడ్ అభివృద్ధిపై కీలక చర్చలు
* గడ్కరీ ‘వంట’ రుచి చూసిన ప్రియాంక.
* రాజకీయాలకు అతీతంగా అగ్రనేతల సమావేశం
* వాయనాడ్ రోడ్ల కోసం ప్రియాంక గాంధీ వినతి.
* సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.
హైదరాబాద్, మహా.

వాయనాడ్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆమె కలిశారు. తన నియోజకవర్గం గుండా వెళ్లే ఆరు ప్రధాన రహదారుల ప్రాజెక్టులను ఆమె మంత్రి ముందు ప్రతిపాదించారు. కేరళలో రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తనదైన శైలిలో హాస్యాన్ని జోడించారు. గతంలో రాహుల్ గాంధీ అమేథీ రోడ్ల గురించి తనను కలిసినప్పుడు ఆ పనులను తాను పూర్తి చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రియాంక అడిగిన పనులు చేయకపోతే, జనాలు “మా అన్న పని చేశారు కానీ మా అక్క పని చేయలేదు” అని అంటారని సరదాగా వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తూ, ప్రియాంక ప్రతిపాదించిన కొన్ని పనులు ప్రస్తుతం కేరళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని గడ్కరీ ఆమెకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశాల్లో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని, అయితే తన పరిధిలోని ప్రాజెక్టులను తప్పకుండా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనిపై ప్రియాంక గాంధీ ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పందించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలో ఉన్న పనుల గురించి ఆందోళన లేదని, కేరళలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తామే పూర్తి చేసుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే నితిన్ గడ్కరీ ఆతిథ్యం. గడ్కరీ స్వయంగా వంటకాలు చేయడంలో అభిరుచి ఉన్న వ్యక్తి. ఆయన ఈ రోజు తన కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ తాను సిద్ధం చేసిన ప్రత్యేక రైస్ డిష్‌ను చట్నీతో సహా వడ్డించారు. ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చిన సమయంలో, ఆమెను కూడా తన వంటకాన్ని రుచి చూడాలని గడ్కరీ పట్టుబట్టారు. దీంతో ఆమె ఆ వంటకాన్ని రుచి చూసి మంత్రిని అభినందించారు. ఇద్దరు అగ్రనేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి, ఆత్మీయతతో గడిపిన ఈ సమయానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాయనాడ్ అభివృద్ధి పట్ల ప్రియాంక చూపుతున్న చొరవను స్థానిక నేతలు, ప్రజలు హర్షిస్తున్నారు.