Mahaa Daily Exclusive

  రౌడీయిజమే సిద్ధాంతం.. అరాచకమే విధానం…వైసీపీ ఉనికిపై పవన్‌ సంచలన ప్రకటన.

Share

* అదొక ఆకు రౌడీల పార్టీ.
* టెర్రరిస్టులకంటే డేంజర్.. ఆ పార్టీకిక గుర్తింపు లేదు.
* రౌడీయిజమే సిద్ధాంతం.. అరాచకమే విధానం.
* ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే.
* వైసీపీ ఉనికిపై పవన్‌ సంచలన ప్రకటన.

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగ్రరూపం దాల్చారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సోమవారం మంగళగిరి వేదికగా ఆయన నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య ముసుగులో చెలామణి అవుతున్న వైసీపీని తాము అసలు ఒక రాజకీయ పార్టీగానే గుర్తించడం లేదని, అది పూర్తిగా నేరస్థులతో నిండిన ఒక వ్యవస్థీకృత ముఠా అని పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస నిర్మాణం, సిద్ధాంతం, విలువలు ఆ పార్టీలో మచ్చుకైనా లేవని, కేవలం దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నించిన వారిని హింసించడమే పరమావధిగా పెట్టుకున్న ఇటువంటి ముఠాను రాజకీయ పక్షంగా పరిగణించడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు చేసిన పాపాలకు, సాగించిన అరాచకాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.
రాజకీయాల్లో విధానపరమైన పోరాటాలు చేయడం సహజమని, కానీ వైసీపీ శైలి మాత్రం ఉగ్రవాదులను తలపించేలా ఉందని పవన్ మండిపడ్డారు. ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి బాంబులు పేల్చితే, వైసీపీ నేతలు తమ ఆధిపత్యం కోసం ప్రత్యర్థుల ఆస్తులను, పార్టీ కార్యాలయాలను బాంబులతో పేల్చారని ఆయన గుర్తు చేశారు. కోనసీమను అగ్నిగుండంగా మార్చడం, అమరావతి రైతులపై దాడి చేయడం, అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. ఇవి ఒక రాజకీయ పార్టీ చేసే పనులేనా అని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని రాక్షస క్రీడ సాగించిన జగన్ అండ్ కోకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని పవన్ తేల్చిచెప్పారు. అధికారం పోయినా వారి అహంకారం తగ్గలేదని, ఇంకా తమది రాజకీయ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ సాగించిన పైశాచికత్వాన్ని పవన్ కల్యాణ్ ఎండగట్టారు. ఆడబిడ్డల మానప్రాణాలతో ఆడుకోవడం, వారిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం వైసీపీకి ఒక వ్యసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న మహిళలను కూడా బూతులు తిడుతూ, మానసికంగా వేధించిన వారిని ‘సైకోలు’ అనక ఇంకేమంటారని ప్రశ్నించారు. భావప్రకటనా స్వేచ్ఛ అంటే బూతులు తిట్టడం కాదని, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టం తనదైన శైలిలో సమాధానం చెబుతుందని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 33 వేల మంది మహిళలు అదృశ్యమైతే కనీసం చీమకుట్టినట్లు కూడా లేని నాటి పాలకులు, నేడు శాంతిభద్రతల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మహిళల కన్నీటి శాపమే ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసిందని, ఇక ఆ ముఠా ఆటలు సాగవని స్పష్టం చేశారు.
పోలీసు వ్యవస్థను, అధికారులను కూడా పవన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. గతంలో వైసీపీ నేతలకు కొమ్ముకాసిన కొందరు అధికారులు ఇంకా పద్ధతి మార్చుకోలేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైసీపీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ఒక నేరగాళ్ల ముఠాగా పరిగణించి, వారి నేరాలను అరికట్టాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, రాష్ట్రంలో తిరిగి శాంతిభద్రతలు నెలకొల్పే వరకు విశ్రమించేది లేదని పవన్ తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కక్ష సాధించడానికి కాదని, కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Latest