తోలు వలుస్తాం’ అంటే చూస్తూ ఊరుకోం.
* అసెంబ్లీ అంటే కేసీఆర్‌కు ఎందుకంత భయం?
* ఫామ్ హౌస్ వదిలి ప్రజల్లోకి రా..
* బీఆర్ఎస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ఖమ్మం బ్యూరో, మహా.
బీఆర్ఎస్ నేతలకు ప్రజల ద్వారా బుద్ధి చెప్పిస్తామని, ప్రజా క్షేత్రంలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పలు సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ‘తోలు తీస్తాం’ అనే వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఆ తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండు సంవత్సరాల పాటు ఫామ్ హౌస్‌లో పడుకొని, ఇప్పుడు బయటకు వచ్చి విషం కక్కుతున్నారని మండిపడ్డారు. తాము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఆశీర్వదించాల్సింది పోయి, తోలు వలుస్తాం అనడం సరికాదని, ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని, అలాంటి మాటలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గత రెండేళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. అసెంబ్లీ అంటే కేసీఆర్‌కు ఎందుకంత భయమని, ప్రజల సమస్యలపై చర్చించే వేదికకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమైతే ఆయనకు ఆ హోదా అవసరమా అని నిలదీశారు. తాము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ సభకు గైర్హాజరు కాలేదని, నిరంతరం ప్రజా సమస్యలపై గళం విప్పామని గుర్తు చేశారు. పదిమంది నాయకులను పక్కన కూర్చు పెట్టుకుని ప్రగల్భాలు పలకడం కాదని, చేతలైతే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని, ఈ ప్రగతిని చూసి ఎక్కడ తమ ఉనికి కోల్పోతామో అన్న ఆందోళనతోనే కేసీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే, అందులో 85 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు 85 శాతం మందిని సర్పంచులుగా గెలిపించి తమ ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను పక్కన కూర్చోబెట్టిన ప్రజలు, తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించారని చెప్పారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.







