ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషిద్ధం.
* పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు..
* అరవళి గుట్టల్లో ఇక మైనింగ్ ఆగిపోవాల్సిందే.
* కేంద్ర పర్యావరణ శాఖ సంచలన నిర్ణయం.
హైదరాబాద్, మహా.
ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత శ్రేణుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మైనింగ్ కార్యకలాపాలకు చరమగీతం పాడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని, కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వడం వెంటనే నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి అధికారిక నోటీసులు అందాయి. ఇప్పటికే ఉన్న లీజుల గడువు ముగిసిన తర్వాత వాటిని పునరుద్ధరించకూడదని కూడా కేంద్రం స్పష్టం చేసింది.
ఆరావళి పర్వతాలు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ, చట్టబద్ధమైన మైనింగ్ వల్ల ఈ కొండలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పర్వతాల అదృశ్యం వల్ల భూగర్భ జల మట్టాలు పడిపోవడం, వాతావరణంలో మార్పులు సంభవించడం , ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం పెరగడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పర్యావరణ వేత్తలు గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్రం, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద తనకున్న అధికారాలను ఉపయోగిస్తూ ఈ నిషేధాన్ని అమలులోకి తెచ్చింది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన వివిధ తీర్పులను కూడా కేంద్రం ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది. ఆరావళి పర్వతాలు ‘ఉత్తర భారతదేశపు ఊపిరితిత్తులు’ అని అభివర్ణించిన న్యాయస్థానం, వీటిని కాపాడటంలో విఫలమైతే భవిష్యత్ తరాలకు భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడటమే కాకుండా, క్షీణించిన అటవీ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఆరావళి ప్రాంతాల్లో తక్షణమే సర్వే నిర్వహించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఈ చర్య వల్ల మైనింగ్ రంగంపై కొంత ప్రభావం పడినప్పటికీ, దీర్ఘకాలికంగా ప్రకృతిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.







