* చెరువులకు పునర్వైభవం.
* మాదాపూర్, కూకట్‌పల్లిలో హైడ్రా కమిషనర్ పర్యటన
* పర్యాటక కేంద్రాలుగా మారనున్న తమ్మిడికుంట, నల్ల చెరువు.
* తమ్మిడికుంట సుందరీకరణపై రంగనాథ్ కీలక ఆదేశాలు
* చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, నగరంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను హైడ్రా శరవేగంతో కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం మాదాపూర్‌లోని తమ్మిడికుంట మరియు కూకట్‌పల్లిలోని నల్ల చెరువులను సందర్శించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ వీటిని అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
మాదాపూర్ ఐటీ హబ్ నడిబొడ్డున ఉన్న తమ్మిడికుంట చెరువు గతంలో ఆక్రమణలు, మురుగునీటితో కలుషితమై ఉండేది. అయితే హైడ్రా చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల ఈ చెరువు విస్తీర్ణం 14 ఎకరాల నుండి ఏకంగా 29 ఎకరాలకు పెరిగింది. పర్యటనలో భాగంగా కమిషనర్ ఇక్కడ నిర్మిస్తున్న రెండు కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్ మరియు బండ్ పనులను పరిశీలించారు. శిల్పారామం వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం ప్రధాన ద్వారం, పార్కులు, ఓపెన్ జిమ్‌లు మరియు పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మిస్తున్న గుమ్మటాలు , ఈ చెరువుకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వర్షపు నీరు సాఫీగా వచ్చేలా ఇన్-లెట్లు మరియు అవుట్-లెట్లను ఆధునీకరించడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వరద ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన కమిషనర్, అక్కడ పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ద్వారా ఈ చెరువు కూడా 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరించింది. పూడిక తీత పనుల ద్వారా చెరువు లోతును పెంచడమే కాకుండా, గట్టుపై సుమారు పది వేలకు పైగా ఔషధ మొక్కలను నాటాలని రంగనాథ్ సూచించారు. స్థానిక మహిళల సౌకర్యార్థం ఇక్కడ ప్రత్యేకంగా బతుకమ్మ కుంటను కూడా సిద్ధం చేస్తున్నారు. చెరువుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు, చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా చెరువులోకి కలవకుండా ప్రత్యేక డైవర్షన్ ఛానల్స్ నిర్మించనున్నారు.
హైడ్రా చేపట్టిన ఈ ప్రక్షాళన పనుల వల్ల నగరంలో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన ఆహ్లాదకర వాతావరణం అందుతుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పనులన్నీ నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి జనవరి లేదా ఫిబ్రవరి నాటికి వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు హైడ్రా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.







