* రవాణా సంస్థలో కొలువుల జాతర.
* ట్రాఫిక్, మెకానికల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
* డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగాలు.
* డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు
హైద్రాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన విడుదల చేసింది. రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు డిసెంబర్ 25న అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు ఉండగా, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 27,080 నుంచి రూ. 81,400 వరకు వేతన శ్రేణి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 ఉదయం 8 గంటల నుంచి జనవరి 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ (www.tgprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 400 కాగా, ఇతర అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి.
ఈ పోస్టులకు సంబంధించి విద్యాార్హతలను మండలి స్పష్టంగా పేర్కొంది. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జూలై 1, 2025 నాటికి ఏదైనా డిగ్రీ (పట్టా) ఉత్తీర్ణులై ఉండాలి. మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుకు ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. బీఈ, బీటెక్ లేదా ఏఎంఐఈ పూర్తి చేసిన వారు కూడా ఈ మెకానికల్ పోస్టులకు అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యర్థుల వయసు జూలై 1, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు 12 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.






