సాగు చేస్తేనే డబ్బులు జమ
‘రైతు భరోసా స్కీమ్’ లో కీలక మార్పులు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, మహా : పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్ పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరికొన్ని మార్పులు ఉండనున్నాయని తెలిపారు. గతంలో సాగు యోగత్య ఉన్నా భూములకు కూడా రైతు భరోసా స్కీమ్ కింద నిధులు జమ చేశారు. అయితే ఈసారి మాత్రం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. శాటిలైట్ ఫొటోల క్రోడీకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు.
సాగు లేకపోతే నిధులు కట్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం స్కీమ్ లో అనేక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న రైతుబంధు పేరును రైతు భరోసా స్కీమ్ గా మార్చింది. అన్ని రకాల భూములకు కాకుండా కేవలం సాగు యోగత్య ఉన్న భూములకే డబ్బులు చేయటం షురూ చేసింది. ఇప్పటికే ఓ సారి ఆయా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేసింది. అంతేకాకుండా వందల ఎకరాలు, రియల్ ఎస్టేట్ భూముల విషయంలోనూ జాగ్రత్తలు చేపట్టింది. తాజాగా సాగు చేస్తేనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో. 10 లక్షల ఎకరాలలోపు భూములకు రైతు భరోసా స్కీమ్ నిధులు ఆగిపోతాయని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేవారు.
రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ద్వారా వేలాది ఎకరాలున్న రియల్ ఎస్టేట్, రాజకీయ నేతలు కూడా లబ్ధి పొందారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపంచింది. ఇందులో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు కూడా ఉన్నారని పేర్కొంది. 2023 ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై ప్రజల ముందు చర్చకు కూడా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా సాహు భూములకు మాత్రమే పథకాన్ని వర్తింప చేయాలన్న ఖచ్చితమైన నిర్ణయాన్ని రావడంతో తాజాగా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నిర్ధారించాలని, అసలైన లబ్ధిదారులు ఎక్కడా నష్టపోకుండా చూడాలని ఆదేశించింది.





