Mahaa Daily Exclusive

  భారీ ఎన్‌కౌంటర్‌తో వణికిన దండకారణ్యం!

Share

భారీ ఎన్‌కౌంటర్‌తో వణికిన దండకారణ్యం!
* పోలీసుల తూటాలకు మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ఖతం.
* ముగిసిన నల్లగొండ నక్సలైట్ ప్రస్థానం.

భువనేశ్వర్, మహా.

ఎర్ర జెండా నీడలో దశాబ్దాల కాలంగా దండకారణ్యాన్ని శాసిస్తున్న మావోయిస్టు సామ్రాజ్యానికి ఒడిశా పోలీసులు కోలుకోలేని దెబ్బ కొట్టారు. బుధవారం రాత్రి కంధమాల్ జిల్లాలోని కీకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అత్యున్నత విభాగమైన సెంట్రల్ కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో గణేష్ భార్య, మరో ఇద్దరు మహిళా క్యాడర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు కోటి పది లక్షల రూపాయల భారీ రివార్డు కలిగిన గణేష్ ఉయికే మరణం.. దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి పెను దెబ్బగా భద్రతా దళాలు భావిస్తున్నాయి.

*మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి*

కంధమాల్ మరియు గంజాం జిల్లాల సరిహద్దుల్లోని చక్రపాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల రాష్ట్రీయ కమిటీ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ రంగంలోకి దిగింది. అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో బలగాలు అడవిని చుట్టుముట్టాయి. పోలీసుల ఉనికిని గుర్తించిన మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నంలో ఎదురుకాల్పులకు దిగారు. గురువారం తెల్లవారుజాము వరకు సాగిన ఈ హోరాహోరీ పోరులో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. సంఘటనా స్థలంలో గణేష్ ఉయికే మృతదేహంతో పాటు అత్యాధునిక ఇన్సాస్ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

**నల్లగొండ నుంచి నక్సల్బరీ వరకు**

ఎన్‌కౌంటర్‌లో హతమైన గణేష్ ఉయికే అసలు పేరు పాకా హనుమంతు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ఈయన, సుమారు 40 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూపులో చేరి క్రమక్రమంగా పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు విస్తరణకు ఈయనే ప్రధాన సూత్రధారి. ముఖ్యంగా 2013లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన జీరమ్ ఘాటీ మారణకాండలో గణేష్ కీలక పాత్ర పోషించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ ‘మోస్ట్ వాంటెడ్’ నేత చివరకు ఒడిశా అడవుల్లో తూటాలకు బలయ్యారు.

**అంతానికి చేరువలో ఉద్యమం?**

ఈ విజయంతో మావోయిస్టుల అగ్రనాయకత్వం మరింత బలహీనపడిందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో వందకు పైగా మావోయిస్టులు హతమవ్వడం గమనార్హం. 2026 నాటికి నక్సలిజం లేని భారత్‌ను చూస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు అనుగుణంగానే ఈ ఆపరేషన్లు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కంధమాల్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ ధృవీకరణతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Latest