* ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో బలి.
* కందుకూరులో డిగ్రీ విద్యార్థి విక్రమ్ ఆత్మహత్య.
* స్మార్ట్ ఫోన్ గేమింగ్ తెచ్చిన తంటా. లక్ష రూపాయల నష్టం .
హైదరాబాద్, మహా.
ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వ్యసనం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా మొదలైన పందాలు చివరకు ఒక విద్యార్థి ప్రాణం తీసే వరకు వెళ్లాయి. రంగా రెడ్డి జిల్లా కందుకూరు మండలం పరిధిలోని దెబ్బడగూడ గ్రామంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విక్రమ్ అనే యువకుడు ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువులో రాణిస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన విక్రమ్, గత కొంతకాలంగా మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బెట్టింగ్‌లో విక్రమ్ భారీగా డబ్బులు పందెంగా కాసి, సుమారు లక్ష రూపాయల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ సొమ్మును ఎలా తిరిగి చెల్లించాలో తెలియక, పెరిగిన అప్పుల భారం తట్టుకోలేక గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డబ్బులు పోగొట్టుకున్నాననే బాధ, ఇంట్లో తెలిస్తే ఏమంటారో అనే భయంతో సతమతమైన విక్రమ్, చివరకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారమని భావించి తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు గమనించే లోపే విక్రమ్ ప్రాణాలు కోల్పోవడంతో దెబ్బడగూడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికి అందిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





