మైసూరు ప్యాలెస్ వద్ద విషాదం.
* సిలిండర్ పేలి ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు.
మైసూరు,మహా.
మైసూరు రాజప్రసాదం (ప్యాలెస్) వద్ద గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో, ప్యాలెస్‌లోని జయమార్తాండ గేట్ సమీపంలో బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ భారీ పేలుడు ధాటికి బెలూన్ విక్రేత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు విక్రేత శరీరం ముక్కలై చెల్లాచెదురుగా పడిపోవడం అక్కడి వారిని భయాందోళనలకు గురిచేసింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న మైసూరు పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ వివరాలను వెల్లడించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి సైకిల్‌పై బెలూన్లు విక్రయిస్తూ, వాటిలో గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని ఆమె వివరించారు.
క్రిస్మస్ వేడుకల కోసం ప్యాలెస్ విద్యుత్ దీపాల అలంకరణను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన పర్యాటకులు, ఈ పేలుడు శబ్దంతో బాంబు దాడి జరిగిందన్న భయంతో అటు ఇటు పరుగులు తీశారు. దీంతో ప్యాలెస్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీం ఘటనా స్థలిలో ఆధారాలను సేకరించాయి. పర్యాటక ప్రాంతాల్లో ఇటువంటి గ్యాస్ సిలిండర్ల వినియోగంపై ఉన్న నిబంధనల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో మైసూర్ ప్యాలెస్ పర్యాటక సందడి ఒక్కసారిగా విషాదంగా మారింది.





