Mahaa Daily Exclusive

  ఐపీఎల్ రికార్డు వీరుడికి దేశ అత్యున్నత గౌరవం…రాష్ట్రపతి భవన్‌లో మెరిసిన యువ క్రికెటర్.

Share

ఐపీఎల్ రికార్డు వీరుడికి దేశ అత్యున్నత గౌరవం.
* రాష్ట్రపతి భవన్‌లో మెరిసిన యువ క్రికెటర్.
* వైభవ్ సూర్యవంశీని వరించిన ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’.
* అతి చిన్న వయసులో బాల పురస్కారం అందుకున్న వైభవ్.
ఢిల్లీ, మహా.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే అసాధారణ రికార్డులను సృష్టిస్తున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని దేశ అత్యున్నత గౌరవం వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వర్ణరంజిత కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌-2025’ను అందుకున్నాడు. క్రీడారంగంలో అతను ప్రదర్శిస్తున్న అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి అతడిని ఎంపిక చేసింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, భారత దేశవాళీ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీనితో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అత్యంత చిన్న వయసున్న ఆటగాడిగా అతను సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాదడం వైభవ్ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం. పురస్కార గ్రహీతగా వైభవ్ పేరు ప్రకటించినప్పుడు సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్ మరియు సర్టిఫికెట్ అందుకున్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్తులో తాను ఒక ధ్రువతారగా ఎదగనున్నట్లు చాటిచెప్పాడు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొని వైభవ్‌ను అభినందించారు. బిహార్‌లోని ఒక సామాన్య గ్రామం నుంచి వచ్చిన వైభవ్, తన పట్టుదలతో ఈ స్థాయికి చేరుకోవడం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తోంది.