* రైతు భరోసా ఆగదు..
* అసత్య ప్రచారాలు నమ్మొద్దు.
* అసలైన సాగుదారులకే రైతు భరోసా!
* శాటిలైట్ నిఘాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు.
* జర్మన్ టెక్నాలజీతో క్షేత్రస్థాయి పరిశీలన.. పారదర్శకంగా జాబితా రూపకల్పన
* వాణిజ్య భూములకు సాయం బంద్.
* స్పష్టం చేసిన సర్కార్.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఈ పథకంపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. సుమారు 65 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్న ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని, అయితే ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మాత్రమే ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందని వివరించింది.
పథకం అమలులో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జర్మన్ టెక్నాలజీ సాయంతో ‘శాటిలైట్ మ్యాపింగ్’ ప్రక్రియను చేపట్టింది. ఈ మ్యాపింగ్ ద్వారా లబ్ధిదారుల వద్ద ఉన్న అసలు సాగు భూమి ఎంత అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారిస్తోంది. 2024లో నిర్వహించిన సర్వే ప్రకారం.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఓఆర్ఆర్ , ఆర్ఆర్ఆర్ పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాల భూమి సాగులో లేదని, అవి వాణిజ్య అవసరాలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి వాణిజ్య భూములకు, కొండలు, గుట్టలకు గతంలో అందిన సాయాన్ని ఇకపై నిలిపివేసి, కేవలం పంటలు పండించే భూములకే రైతు భరోసాను పరిమితం చేయనుంది.
రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ. 12,000 చొప్పున ప్రభుత్వం అందించనుంది. గత ఏడాది దాదాపు రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈసారి కూడా రబీ, ఖరీఫ్ సీజన్లలో పంటలు వేసే వారందరికీ ఈ సాయం అందుతుందని పేర్కొంది. పథకం అమలులో ఎటువంటి కొత్త షరతులు విధించలేదని, కేవలం అనర్హులను తొలగించి నిజమైన సాగుదారులకు న్యాయం చేయడమే తమ ప్రాధాన్యతని అధికారులు తెలిపారు.
జాబితా సవరణలో భాగంగా ఒకవేళ అర్హులైన రైతుల పేర్లు తొలగించబడినా, లేదా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం సూచించింది. బాధితులు నేరుగా జిల్లా కలెక్టర్ లేదా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను కలిసి తమ వివరాలను అందజేయవచ్చు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా పంపిణీని కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసిన రికార్డు ఉందని, నిజమైన లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.








