ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆరా మస్తాన్ విచారణ పూర్తి.
* 2020 నుంచే నిఘా ఉందన్న అనుమానం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సెఫాలజిస్ట్, ‘ఆరా’ సంస్థ అధినేత ఆరా మస్తాన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో సిట్ అధికారులు ఆయన నుంచి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ కేసులో ఆరా మస్తాన్ సిట్ ఎదుట హాజరుకావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో ఏర్పాటైన నూతన సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆరా మస్తాన్‌ను విచారణకు పిలిపించిన అధికారులు, గతంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని మరోసారి సరిచూసుకున్నారు. ప్రధానంగా 2020 సంవత్సరం నుంచి ఆరా మస్తాన్ ఫోన్ కాల్స్ డేటాను, ఆయన ఎవరెవరితో సంభాషించారు, అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాలేంటి అనే అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీసినట్లు సమాచారం. ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో సేకరించిన సాక్ష్యాధారాలను నిర్ధారించుకోవడానికే ఈసారి పిలిచినట్లు తెలుస్తోంది.
విచారణ అనంతరం ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ 2020 నుంచే ట్యాపింగ్‌కు గురైందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ పరమైన సమాచారం తెలుసుకోవడానికే తనపై నిఘా పెట్టి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, దర్యాప్తు బృందం పనితీరు పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు తీరు చూస్తుంటే మరో రెండు నెలల్లోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీస్ అధికారుల వాంగ్మూలాలు, ఆరా మస్తాన్ వంటి బాధితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ వ్యూహకర్తలు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఈ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో, తాజా విచారణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.





