కారేపల్లిలో కల్తీ మద్యం…
*వైన్స్ షాప్ యజమాని ఇంట్లో లభ్యమైన బాటిళ్లు
*స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
*తూతూమంత్రం కేసుతో వైన్ షాప్ యజమానిని కాపాడే యత్నం
*ఎక్సైజ్ అధికారుల తీరుపై అనుమానాలు
కారేపల్లి, మహా:కంచే చేను మేసిన చందంగా ఉంది కారేపల్లి ఎక్సైజ్ అధికారుల తీరు.. కల్తీ మద్యంపై కొరడా జులిపించాల్సిన అధికారులు కల్తీ మద్యం దారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఓ వైన్ షాప్ యజమాని ఇంట్లో శుక్రవారం సోదాలు జరిపి 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్న విషయం ఒక రోజల్లా గోప్యంగా ఉంచి కేసు నమోదు చేశామని శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు వెల్లడించడం దాంట్లో ఉన్న మతలబు చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు… ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న 30 బాటిళ్లలో బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ కు చెందిన 16మద్యం బాటిళ్ళు మూతలు తీసి కల్తీ చేసినట్లు సమాచారం. దొరికిన బాటిళ్లను రీజనల్ కెమికల్ ల్యాబ్ కు పంపితే కల్తీభాగోతం బయటపడుతోంది. ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో పాటు వైన్స్ షాప్ యజమానిని కాపాడటం కోసం తూతూ మంత్రం గా కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నాము.. కేసు కూడా నమోదు చేశామని ఎక్సైజ్ ఎస్సై వసంత లక్ష్మి, సిఐ ప్రశాంతి విలేకరులకు వివరాలు వెల్లడించినప్పటికీ కేసు నమోదు చేసిన తీరులో వైన్స్ షాప్ యజమానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాలు వెల్లడించడానికి ఎందుకు జాప్యం చేశారనే గోప్యతపై బయట జరుగుతున్న ప్రచారానికి ఎక్సైజ్ అధికారులు స్పష్టతనియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెల్ట్ షాపుల్లో ఫుల్ బాటిళ్ళు ఉండకూడదనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ ఈ వైన్ షాప్ యజమాని తన ఇంట్లో భారీగా ఫుల్ బాటిళ్ళు ఉంచుకొని అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నా ఎక్సైజ్ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి..






