Mahaa Daily Exclusive

  గ్రామ పంచాయతీలకు కేంద్రం ఊరట: 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Share

  • 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
  • ఈ నెలాఖరు లోపు రూ. వేయి కోట్లు
  • వచ్చే నెలలో మిగిలిన నిధులు విడుదల చేస్తామన్న కేంద్రం
  • నిధుల వినియోగం కోసం మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో, గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, అధికారుల నిరంతర కృషి, సంప్రదింపుల ఫలితంగా నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీపీలకు రావాల్సిన సుమారు రూ. 2500 కోట్ల పెండింగ్ నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ నెలాఖరు లోపు కనీసం రూ. వెయ్యి కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్టు సమాచారం. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిధులను
వెంటనే వినియోగించుకునేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు మెమో జారీ చేసి, నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అదే సమయంలో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో కూడా ఆ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి మేకర్, చెకర్‌గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను ఈ గ్రామ్ స్వరాజ్ లో నమోదు చేసి సంబంధిత ఎంపీడీవో ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ మేకర్‌గా, సర్పంచ్ చెకర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరో సారి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు క్లాస్ –3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి కాగా, సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యంతో పాటు యూఎస్ బీ టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జీఈఎం పోర్టల్, ఈ-ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా వెంటనే సేకరించి, నమోదు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి 15 ఆర్దిక సంఘం నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారి చేశారు.

Latest