- ట్రాఫిక్ చలాన్లపై కాదు
- కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు ఆటో డిడక్షన్ పెట్టండి
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మహా : ట్రాఫిక్ చలాన్లు పడగానే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం రాయితీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్ లేదని మాట మారుస్తోందని దుయ్యబట్టారు. ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకున్నారని, ఇతర హామీల మాదిరిగా ట్రాఫిక్ చలాన్లపై మాట మార్చడమేనని ద్వజమెత్తారు. మంగళవారం ఎక్స్ వేదికగా బండి సంజయ్ పోస్టు చేశారు.
ముందుగా రేవంత్, కేటీఆర్ ఖాతాలను లింక్ చేయాలి
రోడ్డు భద్రత ముఖ్యమే. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇది ఎవరూ కాదనలేని విషయం. కానీ చలాన్ల కోసం ఆటో డెబిట్ విధానం తీసుకురావాలన్న సూచన అత్యంత చెడ్డ ఆలోచన అన్నారు. అయినా ఇదే విధానం అమలు చేసేందుకు ముందుకు వెళ్లాలనుకుంటే తొలుత వాహనాల కోసం సరైన రోడ్లు వేయలేని మున్సిపల్ శాఖ మంత్రులైన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ బ్యాంకు ఖాతాలను లింక్ చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తోందని డబ్బులు జమ చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ జన్ ధన్ ఖాతాలను ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల బ్యాంకు ఖాతాల నుంచే నేరుగా డబ్బులు లూటీ చేయాలనుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఖజానా నుంచి ఆటో డిడక్షన్ అయ్యేలా చేయాలన్నాలన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్, రైతు భరోసా, పెన్షన్ లతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. పెనాల్టీలు వసూలు చేయడంలోనే చూపించే వేగం ఇచ్చిన హామీల అమలులోనూ చూపించాలన్నారు.








