- నూతన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ
- ట్రైనింగ్ షెడ్యుల్ ఖరారు చేసిన పంచాయతీ రాజ్ శాఖ
- ఈనెల 19 నుంచి వచ్చేనెల 21 వరకు శిక్షణ
- గ్రామ పాలనను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దే దిశగా శిక్షణా తరగతులు
- మంత్రి సీతక్క ఆదేశాలతో టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతులు
హైదరాబాద్, మహా : గ్రామ పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సర్పంచ్‌లకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హక్కులు, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంపై లోతైన అవగాహన కల్పించేలా శిక్షణా మాడ్యూల్‌ను రూపొందించారు. పైపైన కాకుండా, ఆచరణలో ఉపయోగపడే విధంగా పక్కా పాఠ్యప్రణాళికతో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సర్పంచ్‌ల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్, కరదీపికను సిద్ధం చేశారు. మొత్తం 12,760 మంది సర్పంచ్‌లకు టీజీఐఆర్డీ ద్వారా అందించనున్నారు.
గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ఈ శిక్షణలు రూపుదిద్దుకున్నాయి. సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పని చేసేలా, గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాల వారీగా ఈ శిక్షణా తరగతులు జరుగుతాయి. ప్రతి జిల్లాలో 5 బ్యాచ్‌లుగా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనుండగా, ఒక్కో బ్యాచ్‌లో కనీసం 50 మంది సర్పంచ్‌లు పాల్గొంటారు. ఒక్కో బ్యాచ్‌కు 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనుండగా, ఒక్కో సర్పంచ్‌కు ఐదు రోజుల పాటు బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం రూ.5,000 వరకు ప్రభుత్వం వెచ్చించనుంది.
ఈ శిక్షణను సమర్థవంతంగా అందించేందుకు మొత్తం 253 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి, వారికి టీజీఐఆర్డీలో ఇప్పటికే ఓరియంటేషన్ పూర్తి చేశారు. వీరు సర్పంచ్‌లకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడే విధంగా, పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ అంశాలపై శిక్షణ అందిస్తారు. సర్పంచ్ శిక్షణా తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. శిక్షణలో పాల్గొనే సర్పంచ్‌లకు భోజనాలు, వసతి సౌకర్యాలు, శిక్షణా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా స్పష్టం చేసింది.
సర్పంచ్‌లకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం అవుతాయని, పారదర్శకమైన పాలన, సమర్థవంతమైన నిధుల వినియోగం, ప్రజల అవసరాలకు వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మంత్రి సీతక్క నాయకత్వంలో ఈ శిక్షణా కార్యక్రమం గ్రామ స్వరాజ్యానికి దృఢమైన పునాది వేయనుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది.








