- అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు?
- జర్నలిస్టుల అరెస్టుపై స్పందించిన సీపీ సజ్జనార్
- సీఎంపై అవమానకర వార్తలు ప్రసారంపై కూడా కేసు నమోదు అయిందని వెల్లడి
- విచారణకు పిలిస్తే రాకపోతే ఏం చేయమంటారని ప్రశ్న
హైదరాబాద్, మహా : తాజాగా జర్నలిస్టుల అరెస్టు విషయంపై హైదరాబాద్ సీపీ, సిట్ అధికారిగా ఉన్న సజ్జనార్ మాట్లాడారు. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారని సీపీ ప్రశ్నించారు. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారన్నారు. అందుకే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఓ టీవీ ఛానెల్ సీఈవో ఎక్కడ ఉన్నారని, పిలిస్తే విచారణకు రావాలి కదా అన్నారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలన్నారు.
అన్ని చట్ట ప్రకారమే జరుగుతాయని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమేనన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారన్నారు. మహిళా అధికారులపై అసత్య కథనాలు ప్రసారం అయితే సమాజంలో ఎలా పని చేయగలుగుతారన్నారు. మహిళా అధికారులను కించపరుస్తూ వార్తలు ఎలా రాస్తారని సజ్జనార్ అడిగారు. అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, సీఎంపై అవమానకర వార్తలు వేయడంపై మరో కేసు నమోదైందన్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి.. సిట్ విచారణ జరుపుతోందన్నారు.








