- అర్ధరాత్రి ప్రైవేటు బస్ బోల్తా.
- దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఘటన.
- 13మంది ప్రయాణీకుల కు గాయాలు.
- దమ్మపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.
- ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.
- రాజమండ్రి నుడి హైదరాబాద్ వెళ్ళే కె.వి.ఆర్. ట్రావెల్స్ గా గుర్తింపు.
- ప్రమాదాలకు అడ్డాగా మారిన గట్టుగూడెం.
దమ్మపేట ,మహా :
మండల కేంద్రం గట్టుగూడెం వద్ద జాతీయ రహదారి పై ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇదే ప్రాంతంలో గత కొంతకాలంగా వరుస ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున షుమారుగా 2గంటల సమయంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్ పల్టీ కొట్టింది. రహదారి ప్రక్కనే ఉన్న కాలు లో బస్ పడిపోయిన తీరు ,బస్ నుండి వచ్చే క్షతగాత్రుల ఆర్తనాదాలను బట్టి షుమారుగా కొంతమందికి ప్రాణ నష్టం జరిగే ఉంటుందనే సంకేతాలు వెలువడే పరిస్థితి ఉంది. కానీ ప్రమాద సమయంలో షుమారుగా 40 మంది ఉండగా దాదాపుగా 13మందికి తీవ్రగాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను దమ్మపేట ప్రాధమిక వైద్యశాల కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తున్న కె.వి.ఆర్ ట్రావెల్స్ గా పోలీసులు గుర్తించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నట్లైంది. స్ధానికుల సమాచారం మేరకు స్ధానిక పోలీసు యస్.ఐ . సాయికిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి :
తరచుగా ప్రమాదాలు జరుగుతున్న గట్టుగూడెం సమీపాన్ని ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్ధాయిలో పర్యవేక్షించి రోడ్ ఎలైన్మెంట్ చేయాలని పలువురు కోరుతున్నారు. ఉండవలసిన నిబంధనలు ప్రకారం రహదారి నిర్మాణం లేక పోవడం వలన ఎక్కువగా మొద్దులగూడెం దాటగానే మలుపు వద్ద డౌన్ రావడంతో భారీ వాహనాలు స్పీడ్ కంట్రోల్ అదుపులోకి రావడం లేదని ,లారీలు ఇతర వాహనాలు ఇదే ప్రాంతంలో తలక్రిందులుగా పడిన ఘటనలు అనేకం ఉన్నాయని స్ధానికులు వివరిస్తున్నారు. వెంటనే ఆర్ అండ్ బి అధికారులు ఈ రహదారిపై ప్రమాదాలు జరగకుండా కనీసం ఇండికేటర్ లైట్లు ,రేడియం స్టిక్కర్ బోర్డులు ఏర్పాటు చేసి , రహదారి ఎలైన్మెంట్ కూడా చేయాలని కోరుతున్నారు.
యస్.ఐ. సేవలు ప్రశంసనీయం. :
బస్ పల్టీ విషయం తెలియగానే అర్ధరాత్రి సమయంలో యస్ఐ స్పందించిన తీరు క్షతగాత్రులను ఆకట్టుకుంది. వెంటనే నాలుగు అంబులెన్స్ లు ,మరొక ప్రైవేటు అంబులెన్స్ ను ఎలర్ట్ చేసి ,ప్రమాదం జరిగిన 10నిమిషాల కే ఘటనా స్ధలానికి చేరవేయడం వల్లనే పెను ప్రమాదం నుండి బయటపడినట్లు క్షతగాత్రులు తెలిపారు. కాలువలో పూర్తిగా పడిపోయిన బస్ నుండి క్షతగాత్రుల ఆర్తనాదాలు వింటే దాదాపుగా పది మంది మృతి చెంది ఉండాలనుకుంటారు. కానీ యస్.ఐ తన సహచర పోలీసుల సహాయంతో చాకచక్యంగా క్షతగాత్రులను ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. ములకలపల్లి ,అశ్వారావుపేట ,దమ్మపేట లనుండి అంబులెన్స్ లు చేరవేస్తూ ,క్షతగాత్రులను వైద్యశాల కు తరలించడం మూలంగా గాయాలతో బయట పడ్డారని తెలిపారు.








