Mahaa Daily Exclusive

  నన్ను రక్షించడానికి భర్త కూడా లేడు:రేణు దేశాయ్

Share

  • నన్ను రక్షించడానికి భర్త కూడా లేడు
  • నా హక్కుల కోసం నేను పోరాడటం లేదు
  • నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్

హైదరాబాద్, మహా : వీధి కుక్కల సమస్యపై అవగాహన కల్పించే క్రమంలో నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ తీవ్రమైన విమర్శలను, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత తన మాజీ భర్త పవన్ కళ్యాణ్, పిల్లలను ఉద్దేశించి నెటిజన్లు చేసిన కామెంట్స్ ఆమెను తీవ్రంగా బాధించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.

నాకు ఎవరూ లేరు

వారణాసి గంగా నదిలో పడవపై ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ రేణు దేశాయ్ ఒక నోట్ రాసింది. “నన్ను రక్షించడానికి నాకు తండ్రి లేరు, తల్లి లేదు, అన్నయ్య లేడు, భర్త కూడా లేరు. నేను చేయని తప్పుకు నాపై ఇంత విషం చిమ్ముతున్నారు. నా బాధను, కన్నీళ్లను ఆ దేవికి, మహాదేవుడికి మాత్రమే చెప్పుకుంటాను. వారే నా బాధను వింటారు, నా కన్నీళ్లను చూస్తారు” అని రాసుకొచ్చింది.

మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి.. కానీ

కొన్ని దూకుడుగా ఉండే కుక్కల తప్పుకు, అమాయకపు కుక్కలన్నింటినీ చంపేయడం తప్పు అని ఈ విషయం అందరికీ అర్థమయ్యే వరకు తాను పోరాడుతూనే ఉంటానని రేణు స్పష్టం చేసింది. “నా వ్యక్తిగత హక్కుల కోసం నేనెప్పుడూ బహిరంగంగా పోరాడలేదు. కానీ మూగజీవాల కోసం గట్టిగా మాట్లాడుతాను. నా గురించి మీరు ఎంత నెగెటివ్, అసహ్యకరమైన కామెంట్స్ అయినా చేసుకోండి.. కానీ నా కన్నీళ్లు ఎవరి సమక్షంలో (దేవుడి ముందు) కారుస్తున్నానో గుర్తుపెట్టుకోండి” అని హెచ్చరించింది.

అసలేం జరిగింది

సోమవారం ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఒక వ్యక్తి తనపై దాడికి రావడంతో రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. “అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేశారు”, “నీ పిల్లలు కుక్క కాటుతో చనిపోతే అప్పుడు బుద్ధి వస్తుంది” అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. దీనిపై రేణు నిన్ననే కన్నీటితో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను మనుషుల ప్రాణాల గురించే మాట్లాడుతున్నానని, అలాగని అన్ని కుక్కలను చంపేయడం పరిష్కారం కాదని ఆమె వాదిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో రేణు సహనం కోల్పోయి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో నటి, యాంకర్ రష్మి గౌతమ్ తో కలిసి రేణు ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు.