Mahaa Daily Exclusive

  మేడారంలో బైక్‌పై మంత్రి..! ఏర్పాట్లను క్షేత్రస్తాయిలో పరిశీలించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి..

Share

  • మేడారంలో బైక్‌పై మంత్రి
  • ఏర్పాట్లను క్షేత్రస్తాయిలో పరిశీలించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి
  • కలెక్టర్ దివాకర్ తో కలిసి బైక్ పై పర్యటించిన మంత్రి
  • చాయ్ తాగుతూ భక్తులతో మమేకం

 

మేడారం, మహా : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. మొదటి రోజు సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చిన గిరిజన పూజారులు రెండోరోజు సమ్మక్కనూ తీసుకు వచ్చారు. సమ్మక్క ఆగనమం జాతరలో కీలక ఘట్టం. ఈ క్షణాలు కన్నులారా దర్శించుకుంటే ఆ జన్మ ధన్యం అని భావిస్తారు భక్తులు. జాతరకు వారం ముందునుంచీ మేడారం జనసంద్రమైంది. జనవరి 28 జాతర మొదటిరోజు భారీగా భక్తులు తరలివచ్చారు. రెండో రోజు నుంచి ఈ రద్దీ మరింత పెరిగింది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు నేరుగా రంగంలోకి దిగి భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు

 

ఎలాంటి హంగులు, ఆర్భాటాలు, కాన్వాయ్ ల హడావుడి లేకుండా జనం మధ్యకు వెళ్లి, భక్తుల ఇబ్బందులు, ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల గురించి మంత్రులు అడిగి తెలుసుకుంటున్నారు. కాన్వాయ్ హడావుడితో వెళితే భక్తులకు ఇబ్బంది అని భావించి బైక్ లపై ప్రయాణం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం తెల్లవారుజామునుంచి కార్య‌క్షేత్రంలోకి దిగి అంద‌రినీ ఆశ్చర్య ప‌రిచారు. జాతరలో కీలక ఘట్టం గురువారం కావడంతో వేకువజామునుంచి మేడారంలో ఏర్పాట్లను పొంగులేటి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొన్నటివరకూ మేడారం అభివృద్ది ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన ఆయ‌న ఇప్పుడు మేడారం జాతరకు వచ్చిన భక్తులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

మేడారంలో బైక్‌పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, ఏర్పాట్లపై ఆరా!

 

వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. కారు దిగి బైక్ ఎక్కారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్‌.దివాక‌ర్‌ను తన వెనుక కూర్చోబెట్టుకుని, స్వయంగా బైక్ నడుపుతూ గల్లీ గల్లీని చుట్టేశారు. ప్రోటోకాల్ గోడలు బద్ధలు కొట్టి, సామాన్యుడిలా భక్తుల చెంతకు చేరారు.జంపన్న వాగు వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ఈప‌ర్య‌ట‌న‌లో స‌హ‌చ‌ర మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. మార్గ మధ్యలో ఓ టీ కొట్టు వద్ద ఆగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హడావిడి పర్యటనలాగా ప్లాన్ చేసుకోలేదు ప్రశాంతంగా టీ కొట్టు వద్ద ఆగి, చాయ్ తాగుతూ అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. ఛాయ్ వాలాతో చ‌మ‌త్క‌రించారు. “ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి?” అంటూ ఆరా తీశారు. ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.