Mahaa Daily Exclusive

  లైంగిక వేధింపుల ఆరోపణలు..! అజ్ఞాతంలోకి జనసేన ఎమ్మెల్యే..

Share

  • లైంగిక వేధింపుల ఆరోపణలు
  • అజ్ఞాతంలోకి జనసేన ఎమ్మెల్యే
  • విచారణ కమిటీకి అందుబాటులోకి రాని నేత
  • ఎమ్మెల్యే ఫ్యామిలీతో మాట్లాడుతున్న విచారణ కమిటీ

 

రైల్వే కోడూరు, మహా : లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ వేసిన విచారణ కమిటీకి కూడా అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. దీంతో ఫ్యామిలీతో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు, విచారణకు హాజరయ్యేలా చూస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తప్పించుకొని తిరిగితే జరుగుతున్న ప్రచారం నిజమనే సంకేతాలు వెళ్తాయని తప్పు చేయకుంటే భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు.

 

అరవ శ్రీధర్ తనను చాలా కాలంగా లైంగిక వేధించారని ఓ మహిళ ఆరోపించారు. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించారన్నారు. గెలిచిన తర్వాత కాంగ్రాట్స్‌ చెప్పిన తర్వాత నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని అన్నారు. తర్వాత టెలిగ్రామ్ లో చాటింగ్ చేశారని తెలిపారు. కొన్ని రోజులు బాగానే మాట్లాడిన ఎమ్మెల్యే తర్వాత అసలు రంగు బయటపెట్టారని ఆరోపించారు. తనను కారులో తీసుకెళ్లి మొదటిసారి తనకు ఇష్టం లేకపోయినా బెదిరించి బలాత్కారం చేశారని మీడియా ముఖంగా వెల్లడించారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా చేస్తానని, ట్రాన్స్‌ఫర్‌ చేస్తానంటూ బెదిరించారని మహిళ వెల్లడించారు. చాటింగ్ టైంలో న్యూడ్స్ పంపించాలని చెప్పేవారని ఆమె తెలిపారు. తనకు ఇష్టం లేదని చెప్పినా పట్టించుకునే వారు కాదని అన్నారు. తన ఇష్టం లేకుండానే తన ఇంటికి కారు పంపించి తీసుకెళ్లే వారని, ఇలా చేయడంతో ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందని బాధితురాలు వాపోయారు. ఎమ్మెల్యే ఫ్రెండ్‌ ద్వారా అబార్షన్ చేయించారన్నారు.

 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ మధ్య సంక్రాంతికి నారావారి పల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇచ్చినట్టు సదరు మహిళ చెప్పుకొచ్చారు. దీంతో ఆ అర్జీ కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లిందని అక్కడి నుంచి తనకు ఒక నెంబర్ ఇచ్చారన్నారు. చంద్రబాబు తనను పిలిచి మాట్లాడారని అనుకున్నట్టు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్నారు. పోలీసులు కూడా తన ఫిర్యాదు తీసుకోవడం లేదని వివరించారు. న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌కు శిక్ష పడాలన్నారు. అంతే తప్ప తనకు ఆయన నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పేశారు. తాను డబ్బులు డిమాండ్ చేసినట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. తాను విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు ఫేక్ కాదని, ఎలాంటి టెస్టుకైనా సిద్ధమని ప్రకటించారు.

 

ఇన్ని ఆరోపణలు రావడంతో శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రహస్య ప్రాంతం నుంచే వీడియో ఒకటి విడుదల చేసి తన తప్పులేదని చెప్పారు. ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు అన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసినవని వివరించారు. ఈ వ్యవహారాన్ని వారం రోజుల్లో తేల్చేయాలని జనసేన అధిష్ఠానం కమిటీ ఏర్పాటుచేసింది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీధర్‌ను ఆదేశించింది. అయితే ఇంతలో ఆయన కనిపించకుండా పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంతో మాట్లాడి విచారణకు శ్రీధర్ రావాలని చెబుతున్నారు.