Mahaa Daily Exclusive

  కేసీఆర్ తెలంగాణ జాతి పిత…

Share

  • కేసీఆర్ తెలంగాణ జాతి పిత
  • రేవంత్ రెడ్డిది ‘శాడిస్ట్’ పాలన
  • ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ధ్వజం

ఆసిఫాబాద్, మహా :
తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎస్ఐటీ విచారణ పేరిట గంటల తరబడి వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సోమవారం ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జల్.. జంగల్.. జమీన్ నుండి నీళ్లు.. నిధులు.. నియామకాల దాకా: “అడవి బిడ్డల కోసం కొమురం భీం పోరాడితే.. కోట్లాది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వారన్నారు. 420 వాగ్దానాల వంచన: “అబద్ధపు హామీలతో, 420 వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఒకరోజు ఖజానా నిండుగా ఉందన్నారు, మరుసటి రోజే ఖాళీ బిందెలు అని డ్రామాలు ఆడుతున్నారని మండి పడ్డారు. ఇది పక్కా ‘బిందె మార్పిడి’ రాజకీయం అని వాఖ్యానించారు. స్కాములకు కేరాఫ్ అడ్రస్ ‘హైడ్రా – మూసీ’ అని పేర్కొంటూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, మూసీ పునరుజ్జీవం పేరిట వేల కోట్ల స్కాములకు తెరలేపడమే ఈ ప్రభుత్వ పనిగా పెట్టుకుందని విరుచుకుపడ్డారు. కల్యాణలక్ష్మి తులం బంగారం ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లిందన్నారు.

సీఎం హోదాకు రేవంత్ అనర్హుడని, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని బూతులు మాట్లాడటం రేవంత్ రెడ్డి సంస్కారహీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడి రాష్ట్రం తెచ్చిన నేతను 5 గంటల పాటు విచారణ పేరుతో వేధించడం శాడిజం కాక మరేమిటి? అని ప్రశ్నించారు.
రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తగులుతుందని, రాష్ట్రం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని శాపనార్థాలు పెట్టారు. ఇంకా రెండేళ్ల పాలన ఉంది ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయండని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. కేసీఆర్ మీద బురదజల్లితే ఆ బురద మీకే అంటుకుంటుంది అని హెచ్చరించారు.