Mahaa Daily Exclusive

  ఎక్స్ అఫీషియో ఓటుపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం: స్థానిక ఓటు ఉంటేనే హోదా ఓటు చెల్లుబాటు!

Share

  • ఎక్స్ అఫీషియో ఓటుపై
  • ఈసీ కీలక నిర్ణయం
  • ఓటేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రమే అవకాశం
  • హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్క్యూలర్ జారీ
  • మారనున్న సమీకరణాలు

హైదరాబాద్, మహా : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో 16న కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన పురపాలికల్లో మేయర్, ఛైర్మన్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై మార్గదర్శకాలను విడుదల చేసిది. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే ఖచ్చితంగా సదరు పురపాలిక పరిధిలో ఓటరుగా నమోదు కావటం తప్పనిసరి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేసింది. గతంలో రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలోని తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేయర్, ఛైర్మన్ ఎన్నిక కోసం ఓటు వేసే అవకాశం ఉండేది. అయితే గతంలో ఈ అంశంపై తుక్కుగూడ మునిసిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వివాదం నడిచింది. దీనిని విచారించిన హైకోర్టు స్థానికంగా ఓటు లేకుండా ఇతర మున్సిపాలిటీల్లో ఓటు వేయటం నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే తాజాగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయాలంటే ఆ మున్సిపాలిటీలోని ఓటర్ జాబితాలో వారి పేరు ఉండాలి. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటేయటానికి, కొనసాగడానికి అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా ఓట్లు వేస్తే అవి చెల్లవని ఎస్‌ఈసీ తాజా సర్క్యూలర్ లో స్పష్టం చేసింది. కాగా, హంగ్ ఏర్పడిన చోట్ల వీరి ఓట్లు కీలకం. తాజా ఎస్‌ఈసీ నిబంధనలతో స్థానికంగా ఓటు లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటును వినియోగించుకోలేరు. దీంతో అనేక చోట్ల మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.

ముందు ప్రమాణ స్వీకారం

మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఈసీ. ఈనెల 16న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యాహ్నం 12.30కి ప్రత్యేక సమావేశం నిర్వహించి తొలుత వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది.

ఎక్స్​ అఫీషియో అంటే ఏంటి

హంగ్ మున్సిపాలిటీ, హంగ్ కార్పొరేషన్‌లలో ఎక్స్ అఫీషియో ఓట్లు అత్యంత ప్రాధాన్యం. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో ఈ ఎక్స్ అఫీషియో ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. రెండు పార్టీలకు సమానంగా వార్డులు వస్తే.. అప్పుడు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎవరికి ఓటు వేస్తారో ఆ కుర్చీ వారికే దక్కుతుంది.

ఎక్స్‌అఫీషియో సభ్యులు అంటే ఎవరు?

ఎక్స్‌ అఫీషియో అనేది లాటిన్‌ భాష నుంచి వచ్చిన పదం. దీనికి ‘పదవీ హోదా కారణంగా’ అని అర్థం. అంటే ఒక వ్యక్తికి ప్రస్తుతం ఉన్న పదవి కారణంగా మరో సంస్థలో సభ్యుడిగా గుర్తింపు ఉండటం. పురపాలికలు, నగరపాలికల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజాప్రతినిధులు వారి హోదా కారణంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. అయితే వారు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోయినా వారికి ఉన్న పదవి కారణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమావేశాల్లో పాల్గొనే హక్కును కలిగి ఉంటారు. అదే సమయంలో మేయర్, ఛైర్మన్ ఎన్నికల్లో కొన్నిసార్లు ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది.

ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎలా ఓటేస్తారు?

ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో ఏదో ఒకచోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. అదే ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు అయితే మాత్రం రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో అయినా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌ అఫీషియో ఓటు వేయాలంటే దానికి ఒక విధానం ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలకు ముందు (ఈ మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు) ఆయా మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గడువులోగా మున్సిపల్ కమిషనర్‌కు అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఎమ్మెల్యే, లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీకి ఓటు హక్కు అమల్లోకి వస్తుంది. అయితే ఆ సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోతే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నప్పటికీ.. ఓటు హక్కు మాత్రం వినియోగించుకోలేరు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్నికైన వార్డు సభ్యులు.. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ను ఎన్నుకునే సమయంలో రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వస్తే.. అప్పుడు ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓటు కీలకంగా మారుతుంది.

Latest