- ప్రజా తీర్పును కాలరాస్తే
- వారిని తిరగనివ్వను
- కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలు
- ఎవరెన్ని కుట్రలు చేసినా పీఠం మాదే
- గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మహా : కరీంనగర్ మేయర్ పీఠంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం, బీఆర్ఎస్ లు కుట్ర చేస్తున్నాయని, మూడు పార్టీలు ఏకమై కరీంనగర్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మేయర్ పీఠం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన సంజయ్ ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం మొదలువుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. బీజేపీకి మేయర్ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని, కరీంనగర్ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోందన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను తిరగనివ్వను అని తీవ్రంగా హెచ్చరించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వలంటైన్స్ డే శుభాకాంక్షలంటూ వ్యంగ్యంగా అన్న సంజయ్ ఈ రెండు పార్టీలతో ఎంఐఎం అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్ తో సంసారం చేస్తూ బీఆర్ఎస్ కు ఎంఐఎం కన్ను కొడుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అక్రమ సంబంధానికి అనుసంధాన కర్త ఎంఐఎం అని అన్నారు. మోదీ ఆశీస్సులు, పాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుందని, అద్బుతమైన తీర్పు ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని కరీంనగర్ లో బీజేపీ గెలిచిందని, ఇండిపెండెంట్లు కూడా బీజేపీలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటిందని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిస్తే కూడా 26 సీట్లకే పరిమితమయ్యాయని, అయినా బీజేపీకి మేయర్ పదవి రానీయ్యకూడదని ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని తెలిపారు. కరీంనగర్ వేదికగా ఈ మూడు పార్టీల బండారం బయటపడబోతోందని, మూడు పార్టీల దిగజారుడు రాజకీయాలను జనం అసహ్యించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు బహిరంగంగా ఒక్కటై మాట్లాడుకుంటున్నారని, సీఎం ఫోన్ చేసి కోరారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్ధికి మద్దతిద్దామని స్థానిక ఎమ్మెల్యే తన పార్టీ కార్పొరేటర్లకు చెబుతున్నారని సంజయ్ తెలిపారు. తమకే మేయర్ పదవి కావాలని ఎంఐఎం కోరుతోందన్నారు. బీజేపీ కార్పొరేటర్లను కూడా ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో కలిసి ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీల రాష్ట్ర నాయకత్వాల నిర్ణయమా? స్థానిక నేతల అభిప్రాయమా? స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అంతర్గత అవగాహన కారణంగానే ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం లేదన్న విషయం స్పష్టమవుతుందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని, ఇది గమనించే ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని చెప్పారు.
గెలిచిన ఇండిపెండెంట్లు సైతం మంచి ఆలోచనతో బీజేపీలో చేరుతున్నారని, అయినా కుట్రలు, కుతంత్రాలు చేసి మేయర్ పదవి బీజేపీకి దక్కకుండా చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కుట్రలు చేస్తే కరీంనగర్ నుండే మీ అంతు చూస్తా అని బీఆర్ఎస్, కాంగ్రెస్ లను సంజయ్ హెచ్చరించారు. బీజేపీ శక్తి ఏందో, కరీంనగర్ ప్రజల దమ్మేందో చూపిస్తామన్నారు. ప్రజాతీర్పును కాలరాస్తే కరీంనగర్ లో ఒక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతను తిరగనీయనని శపథం చేశారు. కరీంనగర్ కేంద్రంగా కాంగ్రెస్ హామీలపై నిలదీస్తానని అంటూ మహిళలకు ఇస్తానన్న రూ.2500లు ఎందుకు ఇవ్వడంతోనే లక్షలాది మంది మహిళలను రోడ్లపైకి తీసుకొచ్చి నిలదీస్తానని అన్నారు. అదే విధంగా రూ. .4 వేల పెన్షన్, రిటైర్డ్ బెన్ ఫిట్స్, డీఏలు, ఈపీఎఫ్ పైసలు రాక రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ, ఉద్యోగులందరినీ రోడ్డుపైకి ఎక్కిస్తానని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి మోదీ చేసిన అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్లి గెలిచామని, అయినా మీరు ప్రజాతీర్పును కాలరాస్తే మా దమ్మేందో చూపిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 26 సీట్లు దాటలేదని, మేయర్ సీటు కోరడానికి సిగ్గు లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పును శిరసావహించకుండా మేయర్ పదవి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగజారి రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏందో చూస్తారన్నారు. భాగ్యనగర్ ను మూడు ముక్కలు చేసి ఒకటి ఎంఐఎంకు రాసివ్వాలనుకుంటున్నారని, భాగ్యనగర్ సీఎం సొంత ఆస్తి కాదన్నారు. కరీంనగర్ కు నేనేం చేశానో, మోదీ ప్రభుత్వం ఏం చేసిందో బుక్ లెట్ తో సహా ప్రింట్ చేసి ఇంటింటికీ పంపించామని, ఎవరో ఏదో కూస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇవ్వలేదని, కరీంనగర్ స్మార్ట్ సిటీ, ఇతర కేంద్ర నిధుల ద్వారా మొత్తం రూ.1400 కోట్లు వచ్చాయన్నారు. పలితాలపై స్పందిస్తూ బీజేపీలో అందరూ కష్టపడి పనిచేశారని, కొన్నిసార్లు ఫలితాలు రాకపోవచ్చు, అంత మాత్రాన ఇతరులు కష్టపడలేదని చెప్పడం సరికాదన్నారు. ఒకప్పుడు దేశంలో రెండే ఎంపీ సీట్లు ఉంటే… కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చామని, 2028లో తప్పనిసరిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు.
జీవం లేని పార్టీ ఎంఐఎం
జీవం లేని పార్టీ ఎంఐఎం పునరుజ్జీవ ఉత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. రజాకార్లు పాకిస్తాన్ వెళుతూ ఎంఐఎం పార్టీని ఇక్కడ వదిలేసి వెళ్లారని, పునరుజ్జీవం అంటే రజకార్ల పాలనను తీసుకొస్తారా?, తెలంగాణ ఆడబిడ్డలను బట్టలిప్పి బతుకమ్మ ఆడించాలనుకుంటున్నారా?, మజ్లిస్ పార్టీని ముస్లిం మహిళలే అసహ్యించుకుంటున్నారన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలంతా మోదీకి మద్దతిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మహిళలు బహిరంగంగానే కమలం పువ్వు పట్టుకుని బీజేపీకి సపోర్ట్ చేశారన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ లో పార్టీల బలాబలాలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8 సీట్లు గెలవగా, ఫార్వర్డ్ బ్లాక్ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది.








