- విజయ్, రష్మిక సంగీత్ సెలబ్రేషన్స్
- లీకైన అన్‌సీన్ రొమాంటిక్ ఫొటోలు
- కోడలు రష్మికపై విజయ్ తల్లి ఎమోషనల్ స్పీచ్
మహా : టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన ‘సంగీత్’ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బుధవారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందులో ఈ జంటకు సంబంధించిన ఎన్నో అన్‌సీన్ రొమాంటిక్ ఫొటోలు ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వధూవరులను ఉద్దేశించి విజయ్ తల్లి మాధవి ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్‌గా మారింది.
అందరి దృష్టిని ఆకర్షించిన అన్‌సీన్ ఫొటోలు
సంగీత్ వేడుక కోసం వేదికను ప్రకాశవంతమైన దీపాలు, తాజా పూలతో ఎంతో అందంగా అలంకరించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అక్కడ ప్రదర్శించిన అన్‌సీన్ ఫొటోలే. ఇన్నేళ్ల ప్రయాణంలో ఈ జంట తీసుకున్న ఎన్నో అందమైన, రొమాంటిక్ ఫొటోలను వేదిక అంతటా ప్రదర్శించారు. ఇవి చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “ఎన్ని అందమైన ఫొటోలో కదా” అని ఒకరు కామెంట్ చేయగా.. “రష్మిక గారూ.. దయచేసి ఆ ఒరిజినల్ ఫొటోలు మాకు కావాలి” అని మరొక అభిమాని కామెంట్ చేశారు. చాలా మంది ఈ ఫొటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయని చెబుతూ హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను పంచుకుంటున్నారు.
కాబోయే కోడలిపై విజయ్ తల్లి ప్రేమ
ఈ సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “హలో ఫ్రెండ్స్. నా ముద్దుల పిల్లలు, నా బంగారం విజయ్, రషీ (రష్మికను ప్రేమగా పిలుస్తూ..)లకు ఈ బ్యూటిఫుల్ సర్ ప్రైజ్ పెర్ఫార్మెన్స్‌ను అంకితం చేస్తున్నాను. వుయ్ లవ్ యూ” అని ఎంతో ఎమోషనల్ అయింది. ఈ వీడియోను షేర్ చేస్తున్న ఫ్యాన్స్ “ఈ స్పీచ్ హృదయాన్ని తాకింది”, “ఇదే అసలైన ప్రేమ” అంటూ కాప్షన్స్ పెడుతున్నారు. అయితే ఆ సర్ ప్రైజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేశారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బహుశా కుటుంబ సభ్యులే ఈ డ్యాన్స్ ప్లాన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
హల్దీ, మెహెందీ సందడి
విజయ్, రష్మికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు తొలుత ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ ఆటలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఎంతో కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల కోసం అతిథులంతా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ తన సోషల్ మీడియాలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా తదితరులు పసుపు రంగు దుస్తుల్లో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
విరోష్ పెళ్లి ముహూర్తం
హిందుస్థాన్ టైమ్స్ సోర్స్ ప్రకారం ఫిబ్రవరి 26 ఉదయం 8 గంటలకు వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. వివాహానికి హాజరుకాలేకపోయిన ప్రధాని మోదీ.. ఈ జంటకు లేఖ ద్వారా తన ఆశీస్సులు పంపారు. ఈ వివాహం అనంతరం మార్చిలో హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
ప్రధాని మోదీ స్పెషల్ విషెస్
ఉదయ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి స్పందిస్తూ, ప్రధాని కార్యాలయం నుంచి ఒక ప్రత్యేక లేఖను పంపించారు. ఈ జంట జీవితాంతం స్నేహితులుగా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సఖా సప్తపదా భవ స్ఫూర్తితో ఈ జంట వైవాహిక జీవితం సాగాలని మోదీ తన లేఖలో ఆశీర్వదించారు. ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ”శ్రీమతి మాధవి & శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారికి, ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్ – రష్మికల వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందకరమైన పవిత్రమైన సందర్భంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు”
”విజయ్ – రష్మికల జీవితంలో ఇది ఒక కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం. సఖా సప్తపదా భవ అనే స్ఫూర్తితో, కలిసి ఏడడుగులు వేస్తోన్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసుండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కలలతో, వాటి నెరవేర్పుతో నిండిపోవాలని, రానున్న కాలమంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిజమైన భాగస్వాములుగా వారి జీవిత ప్రయాణం సాగాలి. ఈ చిరస్మరణీయ సందర్భంలో ఆ జంటకు, వారి కుటుంబ సభ్యులకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.








