- ఒడిశా మైనింగ్ శాఖలో అవినీతి అనకొండ
- రూ. 30 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు
- సోదాలు చేస్తే ఓ మినీట్రక్కు పట్టేంత కట్టలు దొరికాయి
భువనేశ్వర్, మహా : ఒడిశా అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ నగదు పట్టుబడటం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. కటక్ మైనింగ్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టరీగా పనిచేస్తున్న దేబబ్రత మొహంతి నివాసాలపై జరిగిన దాడుల్లో కోట్లాది రూపాయల అక్రమ సంపాదన వెలుగుచూసింది. కేవలం 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈ అధికారి వెనుక ఇంతటి భారీ కుంభకోణం దాగి ఉందని అధికారులు సైతం ఊహించలేకపోయారు. ఒక కాంట్రాక్టరుకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు దేబబ్రత మొహంతి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం, ఆయన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మెరుపు దాడి చేసి పట్టుకుంది. ఆ సమయంలో ఆయన ఆఫీసు డ్రాలో విజిలెన్స్ అధికారులకు అదనంగా రూ. 1.20 లక్షల నగదు లభించింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వెంటనే ఆయన వ్యక్తిగత నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
భువనేశ్వర్‌లోని ఆయన విలాసవంతమైన ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యాలు కనిపించాయి. బీరువాలు, బ్యాగుల్లో కట్టల కొద్దీ నగదు గుట్టలుగా పడి ఉంది. గంటల తరబడి సాగిన లెక్కింపులో సుమారు రూ. 4.10 కోట్లకు పైగా నగదు తేలింది. ఒడిశా విజిలెన్స్ శాఖ చరిత్రలో ఒక ప్రభుత్వ అధికారి నుంచి పట్టుబడిన అత్యధిక నగదు సీజర్ ఇదే. నగదుతో పాటు సుమారు 130 గ్రాముల బంగారం, భువనేశ్వర్‌లోనే ఒక రెండంతస్తుల భవనం, మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సమగ్ర విచారణ కొనసాగుతోంది. ఒక మైనింగ్ శాఖ అధికారి వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం వెనుక పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేబబ్రత మొహంతిని అరెస్ట్ చేసిన విజిలెన్స్ కోర్టులో హాజరుపరిచింది. ఈ ఉదంతం ఒడిశా అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపడమే కాకుండా, అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో మరోసారి నిరూపించింది.








