Mahaa Daily Exclusive

  యూ ట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు….

Share

  • యూ ట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు
  • యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లకు పంజాగుట్ట పోలీసుల లేఖ
  • హిందూ దేవుళ్ళపై, భారతదేశంపై చేసిన కామెంట్లపై కేసులు నమోదు
  • కరాటే కళ్యాణి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

హైదరాబాద్, మహా : ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి వింతలు, విశేషాలు, కొత్త విషయాలను సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ ఫేమస్ అయిన ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అన్వేష్ గత కొంత కాలంగా వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అన్వేష్ చేసే విన్యాసాలు, సాహసాలకు ఒకప్పుడు మంత్రముగ్దులై అతడి ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను సబ్‌స్క్రైబ్ చేసుకుని, ఫాలో అయిన చాలా మంది నెటిజన్లు.. అన్ సబ్‌స్క్రైబ్, అన్ ఫాలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటికీ కారణం అతడు చేస్తున్న అసభ్యకరమైన కామెంట్లే. అయితే మహిళల వస్త్రధారణ వివాదంపై కొన్ని రోజుల క్రితం స్పందించిన అన్వేష్ హిందూ దేవుళ్లపై, భారతదేశంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన వేళ అతడిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

పంజాగుట్ట పోలీసులు అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్‌ మీడియాలో అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కరాటే కళ్యాణి చేసిన ఫిర్యాదుతో గత ఏడాది నమోదైన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నోటీసులు ఇచ్చారు. విశాఖకు చెందిన అన్వేష్‌ విదేశాలన్నీ తిరుగుతూ యూట్యూబ్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌ నడుపుతున్నాడు. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అన్వేష్ తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ సినిమా ఈవెంట్‌లో భాగంగా సీనియర్ హీరో శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అన్వేష్ హిందూ దేవీ, దేవుళ్లపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అప్పటిదాకా అన్వేష్‌కు మద్దతుగా నిలిచిన ఫాలోవర్లు కాస్తా.. ఈ వ్యాఖ్యలతో వారంతా అన్ ఫాలో చేస్తుండటం గమనార్హం.

అన్వేష్‌ చేసిన వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి సహా పలువురు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. విదేశాల్లో ఉంటూ దేవుళ్లను కించపరుస్తూ దేశంపై, భారత సంస్కృతిపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కరాటే కళ్యాణి.. అతడ్ని స్వదేశానికి రప్పించే వరకు నిద్రపోనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. అన్వేష్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ కనిపించలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. దీనిపై స్పందించిన అన్వేష్ మరో వీడియో విడుదల చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోతే పోయింది.. దానివల్ల తనకు రూపాయి కూడా ఉపయోగం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత కొత్త పాస్‌పోర్ట్ కోసం ఇన్‌స్టాగ్రామ్ డీ యాక్టివేట్ అయిందని అసలు విషయాన్ని వెల్లడించాడు. తనకు మరో ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉందని తెలిపాడు.