Mahaa Daily Exclusive

  కొబ్బరి పీచుతో టీ పొడి….

Share

  • కొబ్బరి పీచుతో టీ పొడి
  • కెమికల్స్ కలిపి విక్రయం
  • హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్, మహా : ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటన అనంతరం తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. రాజమండ్రి ప్రాంతంలో కల్తీ పాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా హైదరాబాద్ నగరంలో కల్తీ టీ పొడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొబ్బరి పీచు, ప్రమాదకర కెమికల్స్‌తో కల్తీ టీ పొడి తయారుచేస్తున్న వ్యక్తిని నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం మంగళవారం సనత్‌నగర్‌ పోలీసులతో కలిసి ఒక ఫ్యాక్టరీపై దాడులు చేసింది. ఫతేనగర్‌ ప్రాంతానికి చెందిన జగన్నాథ్‌ బిష్ణోయ్‌ అనే వ్యక్తి కొబ్బరి పీచుతో టీ పొడి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ లాభాల కోసం సింథటిక్‌ కెమికల్స్, కొబ్బరి పీచు ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కెమికల్ రంగు కలిపిన టీ పొడి 120 కిలోలు, సహజమైన టీ పొడి 30 కిలోలు, కొబ్బరి పీచు నుంచి వచ్చే కోకోపీట్‌ మిశ్రమం 138 కిలోలు, బెల్లం, ఇతర కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్ నగర వ్యాప్తంగా పాలు ఇతర ఆహార పదార్థాలపై నిరంతరం నిఘా పెడుతున్నట్లు ఐపీఎం, ఫుడ్‌(హెల్త్‌) అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ శివలీల వెల్లడించారు. ఆన్‌లైన్‌ పోర్టల్, హెల్ప్‌డెస్క్‌, ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు చేసి శాంపిళ్లు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. వాటి వివరాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చుతున్నామని తెలిపారు. ఆహార కల్తీకి పాల్పడితే క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఆహార పదార్థాలు తయారు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.