- బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై
- డీజీపీని కలిసిన బీజపీ నేతలు
- తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి
- ఎంఐఎం ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న రాంచందర్ రావు
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో బిజెపి నాయకుల బృందం రాష్ట్ర డీజీపీని కలిసింది. డీజీపీని కలిసిన బృందంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. గౌతం రావు, వేముల అశోక్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులున్నారు. ప్రధానంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డి పట్టణం, అలాగే నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రాంతాల్లో జరిగిన మూడు తీవ్రమైన సంఘటనలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా క్షీణించిందనే దానికి నిదర్శనమని డీజీపీ దృష్టికి బీజేపీ నేతలు తీసుకు వెళ్ళారు. ఈ మూడు ఘటనలపై ఎలాంటి పక్షపాత ధోరణి అవలంభించకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపి దోషులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల్లో చట్టంపై విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. అదే విధంగా బీజేపీ కార్యకర్తలపై బనాయించిన తప్పుడు కేసుల ఉపసంహరించుకోవాలని డీజీపీకి సమర్పించిన లేఖలో పేర్కొనడం జరిగింది.
డీజీపీ శివధర్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస ఘటనలు రాష్ట్రంలో మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై డీజీపీకి పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. బాన్సువాడ ఘటనపై మాట్లాడుతూ, ఒక హిందూ యువతి భక్తి గీతాలు వినడాన్ని అభ్యంతరం చెప్పి ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేయడం, అవమానించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునివ్వగా, ఆ సందర్భంలో ప్రధానంగా హిందూ యువకులనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకపక్షంగా అరెస్టులు చేశారని విమర్శించారు. సుమారు 27 మందిని జైలుకు పంపడమే కాకుండా, మరికొందరిని “అప్స్కాండింగ్”గా చూపుతూ వారి కుటుంబాలను వేధిస్తున్నారన్నారు.
కామారెడ్డిలో, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గుంపుగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారని, మజ్లీస్ పార్టీకి చెందిన వారి సహకారం కూడా ఉందని తెలిపారు. బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడం వల్లే ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో, స్థానిక న్యాయవాది కళ్యాణిపై దాడి చేయడం అత్యంత అమానుషమని అన్నారు. ఒక మహిళా న్యాయవాదిపై దాడి జరగడం చట్టసువ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేలా జరిగిందని తెలిపారు. ఉత్తర తెలంగాణ మొత్తం మీద మజ్లీస్ పార్టీకి చెందిన అరాచకాలు పెరుగుతున్నాయని, కొన్ని వర్గాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, దాడులు ఎదుర్కొన్న వారిపైనే కేసులు పెట్టి, అసలు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ లో అమ్మవారి ఆలయం, బార్కాస్ లో హనుమాన్ ఆలయం, సఫిల్‌గూడ, ముత్యాలమ్మ ఆలయం, కీసర హనుమాన్ ఆలయం వంటి పలు ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఇవన్నీ ఒకే దిశగా జరుగుతున్నాయా? దీని వెనుక ఎవరు ఉన్నారు? అని ప్రశ్నించారు. ఈ ఘటనలను అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయన్నారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని, హోంమంత్రిగా కూడా ఆయనే ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఈ అంశాలపై డీజీపీ సానుకూలంగా స్పందించి, తగిన విచారణ చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు.








