- రిలయన్స్ దిగ్గజం
- అనిల్ అంబానీకి బిగ్ షాక్
- రూ. 3,716 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
- సీబీఐ విచారణలోని అంశాల ఆధారంగా ఈడీ చర్యలు
ముంబై, మహా : మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) గట్టి చర్యలు చేపట్టింది. రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి చెందిన రూ. 3,716 కోట్ల విలువైన 17 అంతస్తుల ముంబై నివాసం అబోడ్ ను అధికారులు జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన బ్యాంక్ మోసం కేసులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని పాలిహిల్ ప్రాంతంలోని 66 మీటర్ల ఎత్తు గల లగ్జరీ ప్రాపర్టీపై తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 15,700 కోట్లకు చేరింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ద్వారా జరిగిన ఆర్థిక అక్రమాలు, రుణాల మళ్లింపుపై జరుగుతున్న విస్తృత విచారణలో భాగంగా ఈ జప్తు జరిగింది. సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు ప్రజా నిధుల మళ్లింపు, మోసం, లంచాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు ముంబై, ఢిల్లీలలో 35కి పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. 50కి పైగా కంపెనీలకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించారు. గ్రూపుకు చెందిన 25 మందికిపైగా వ్యక్తులను విచారించారు. 2017-19 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 3,000 కోట్ల రుణాలను మళ్లించడానికి అంబానీకి అనుబంధంగా ఉన్న కంపెనీలు ఒక వ్యవస్థీకృత పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సరైన వివరాలు తీసుకోకుండా రుణాలు మంజూరు చేయడం, అధికారిక ఆమోదానికి ముందే నిధులు విడుదల చేయడం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.







