Mahaa Daily Exclusive

  డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాలి-జర్నలిస్టు సంఘాల డిమాండ్

Share

  • డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాలి
    -జర్నలిస్టు సంఘాల డిమాండ్
  • గన్ పార్కు నుంచి మీడియా అకాడమీకి ర్యాలీ
    -అకాడమీ ఎదుట బైఠాయించిన డెస్క్ జర్నలిస్టులు

హైదరాబాద్, ఫిబ్రవరి,25 : డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్లు కార్డులను పెంచాలని,అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులివ్వాలని పలు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని గన్ పార్కు నుండి నాంపల్లి చాపల్ రోడ్డులోని మీడియా అకాడమీ వరకు జర్నలిస్టుల ర్యాలీ జరిగింది. అనంతరం జర్నలిస్టులు మీడియా అకాడమీ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్),టీయూడబ్ల్యూజే-143 సంఘాల నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య
మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మీడియా అక్రెడిటేషన్ల విషయంలో ఘోర వైఫల్యం చెందిందని, రెండేండ్లు జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్న పాత్రికేయులకు స్వరాష్ట్రంలో అన్యాయం జరిగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేవని, జర్నలిస్టు గర్తింపు కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి దుస్థితి ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం 23 వేల అక్రెడిటేషన్ కార్డులిస్తే…ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 44 వేల కార్డులిస్తామని ప్రకటించిందని, అనేక కఠినమైన నిబంధనలు పెట్టి కార్డుల సంఖ్యను భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. డెస్క్ జర్నలిస్టులకు గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురికి అక్రిడిటేషన్ కార్డులు వచ్చాయని, ప్రస్తుతం ఎడిషన్ సెంటర్ కు కేవలం నాలుగు కార్డులు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమని అన్నారు. డెస్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లోనే పని చేస్తున్నప్పటికీ, ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్కులు వేర్వేరుగా ఉంటాయని, ప్రతి జిల్లాకు ఒక ఇన్చార్జితో పాటు నలుగురు సబ్ ఎడిటర్లు పనిచేస్తుంటారని తెలిపారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు 12 నుంచి 8కి తగ్గించారని, వారికి కూడా15 కార్డులు ఇవ్వాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.టీయూడబ్ల్యూజే-143 కోశాధికారి యోగానంద్ మాట్లాడుతూ, అక్రెడిటేషన్ల మంజూరులో వివక్ష తగదని, జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, లేదంటే జర్నలిస్టు సంఘాలను కలుపుకొని సచివాలయ ముట్టడితో పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వెనుకాడబో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో-కన్వీనర్ బ్రహ్మం, డెస్క్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి రాజారాం, నాయకులు వెంకటరమణ, ఎస్.వెంకటేష్, మహిళా జర్నలిస్టు పి. పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర రావుకు వినతి పత్రం సమర్పించారు.