Mahaa Daily Exclusive

  ఐకేపీ అక్రమాలపై కొనసాగుతున్న విచారణ

Share

  • ఐకేపీ అక్రమాలపై కొనసాగుతున్న విచారణ
  • మొండి బకాయిలెన్ని…? మింగేసినవి ఎన్ని..?
  • లెక్కలు తేల్చే పనుల్లో ఐకేపీ యంత్రాంగం
  • మొట్లగూడెం అక్రమంపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టరు..?

కారేపల్లి, మహా:సింగరేణి మండలంలో ఐకెపిలో జరుగుతున్న అక్రమాల పై విచారణ తూ తూ మంత్రంగానే కొనసాగుతోంది. మూడు కోట్ల రూపాయల పైబడిన మొండి బకాయిలలో ఉద్దేశ పూర్వకంగా మింగేసినవి అన్ని? మొండి బకాయిలు ఎన్ని? అనే అంశాలను పరిశీలిస్తూ లెక్కలు తేల్చే పనుల్లో ఐకెపి అధికారులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు జిల్లాస్థాయిలో కొందరు అధికారులతో కూడా మంచి సంబంధం ఏర్పాటు చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు కొందరి రాజకీయ నాయకుల అండదండలు కూడా అక్రమార్కులకు నిండుగా ఉండటంతో ఇష్టా రాజ్యాంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్ ఆర్ యాక్ట్ ప్రయోగించాల్సిన పరిస్థితి కారేపల్లి మండల స్వయం సంఘాలకు ఎవరు తెచ్చారనే దానిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు అక్రమార్కుల వల్ల మండలం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని ఐకెపిలోని నిజాయితీపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మోట్లగూడెం అక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారుల మౌనం ఎందుకు?
మొట్లగూడెం గ్రామంలో లేని వారి పేర్లతో ఫేక్ గ్రూప్ ని సృష్టించి బ్యాంకు సొమ్మును అక్రమంగా కాజేసిన వారికి పూర్తిస్థాయిలో సహకరించిన అప్పటి ఏపీజీవీబీ మేనేజర్ పై చర్యలు తీసుకోవడం లో బ్యాంకు ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. బ్యాంకు లింకేజీ రుణం అనేది పూర్తిస్థాయిలో అది బ్యాంకు సొమ్ము. రూ. 12 లక్షల బ్యాంకు సొమ్మును స్వరాజ్, వినాయక్ అనే గ్రూపుల పేర్లతో అక్రమంగా కాజేశారని బట్టబయలైనప్పటికీ అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పరువురు ప్రశ్నిస్తున్నారు.
*తూతూ మంత్రంగా ఐకేపీ అధికారుల విచారణ
అడ్డగోలుగా అడ్డు అదుపు లేకుండా చేసిన మోట్లగూడెం అక్రమంపై ఐకెపి అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి తప్పు చేసినవారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో లేని వారితో గ్రూపును తయారుచేసి వారికి లోన్లు మంజూరు చేయించడం లో కీలకపాత్ర పోషించిన సీసీ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
*క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టరు?
అక్రమంగా బ్యాంకు సొమ్మును కాజేసిన దాంట్లో పాత్రధారులైన బ్యాంకు మేనేజర్, ఐకెపి సీసీ, బుక్ కీపర్ పై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ఫైల్స్ తయారు చేసే బ్యాంకు సొమ్ము 12 లక్షల రూపాయలు కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని ఇప్పటికే ఓ రాజకీయ పార్టీ అనుబంధ మహిళా సంఘం ప్రకటన కూడా చేసింది. ఐకేపీ అక్రమాలపై ఆందోళనలు చేయకముందే అధికారులు స్పందించి నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.