Mahaa Daily Exclusive

  ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు….

Share

ఇంటర్నెట్ డెస్క్, మహా : ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు చేపట్టింది. ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఈ దాడులను నిర్వహిస్తోంది ఇరాన్. వాటిలో ప్రధానంగా ఇస్రాయెల్‌, బహ్రెయిన్‌, అమెరికా వంటి దేశాలున్నాయి. టెహ్రాన్ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తరహా దాడులకు పాల్పడింది. అయితే.. ఈ దాడులను ఆ దేశాలపై మరింత శక్తిమంతమైన ప్రతిస్పందనను పంపడం, తమ భద్రతను పెంపొందించడం కోసం ఇరాన్ చేసిన చర్యగా పలువురు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ వైపు ఇరాన్ క్షిపణుల దాడి జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగినట్టు తెలిపింది. మిసైల్ దాడులను అడ్డుకునేందుకు తమ దేశ వైమానిక రక్షణ శ్రేణి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. ఈ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. ఇరాన్ వల్ల ఎదురవుతున్న ముప్పును తప్పించుకునేందుకు.. అమెరికాతో కలిసి పోరాడతామన్నారు.

అంతకముందు.. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో పట్టపగలే ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేపట్టింది. ఉత్తర టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో ఒకేసారి ఈ దాడులు జరిగాయి. ఇరాన్‌ అధ్యక్ష భవనం, కీలక ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఈ దాడులు జరగ్గా.. మొదటి దాడి సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. అప్పటికే ఖమేనిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిదాడులు చేపట్టింది ఇరాన్‌. అంతకముందే.. ప్రతిచర్యలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ కు చెందిన ఓ అధికారి చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ దాడులపై ప్రపంచదేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇరాన్‌ దాడులను ఖండిస్తూ, విదేశీ మద్దతు పొందిన దేశాలు తమ భద్రతా చర్యలను వేగవంతం చేసాయి. అంతేకాకుండా.. ఈ చర్యలు మధ్యప్రాచ్య ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు తావిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజా దాడులతో ఇరాన్‌, ఇతర దేశాల మధ్య వివాదాలు మరింత పెరిగే అవకాశముందని.. అంతర్జాతీయ బలం, భద్రతా వ్యూహాలు, రాజకీయ పరిస్థితులు ఇంకో దశకు చేరుకుంటాయని పేర్కొంటున్నారు..