Mahaa Daily Exclusive

  దేశ రక్షణ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాల నివాసాలు….

Share

  • దేశ రక్షణ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాల నివాసాలు
  • దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం
  • వారికి గుర్తింపు పత్రాలు ఎలా వచ్చాయో విచారణ జరపండి
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఝప్తి

హైదరాబాద్, మహా : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిం అక్రమ వలసదారులను గుర్తించి వారిని ఆయా దేశాలకు పంపేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఝప్తి చేసింది. ఆయా రోహింగ్యాలు, వలసదారులంతా దేశ రక్షణ సంస్థలున్న పరిసరాల్లో నివాసం ఉంటున్నాయని, దీనివల్ల దేశ భద్రతకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.రాఘవ రెడ్డి, రావినూతల శశిధర్ సహా పలువురు నేతలు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిసరాల్లో బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ వలసదారుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 24న శ్యామ్ సుందర్ సంఘ్ అనే సంస్థ “జాగో భాగ్యనగర్ – చలో బలాపూర్” పేరుతో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 26 అక్రమ రోహింగ్యా కాలనీలు ఉన్నట్లు తెలిపారు. ఈ కాలనీలన్నీ రక్షణ శాఖ భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అక్రమ వలసదారులు రక్షణ ప్రాంతాలు మరియు వ్యూహాత్మక ప్రాంతాల దగ్గర నివసించడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వలసదారులు స్థానిక ప్రజల జీవన విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరివల్ల అక్రమ కార్యకలాపాలు, నేరాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న వేలాది బంగ్లాదేశీయులు, రోహింగ్యా వలసదారులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుని, వారిని వారి దేశాలకు పంపించాలని కోరారు. ముఖ్యంగా ప్రజల భద్రత కోసం డీఆర్డీఓ , డీఆర్డీఎల్ , ఆర్సీఐ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర వ్యూహాత్మక ప్రాంతాల్లోని బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిం చొరబాటుదారుల ఆక్రమ నివాసాలను తొలగించాలని విజ్ఝప్తి చేశారు. అందుకోసం తక్షణమే ఆయా చొరబాటుదారులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. దీంతోపాటు ఆయా చొరబాటుదారులు అధికారిక గుర్తింపు పత్రాలు ఎలా పొందారో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.