హైదరాబాద్, మహా
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. ఈ యుద్ధ ప్రభావం నేరుగా వెండి, బంగారం మార్కెట్‌పై పడనుంది. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యుద్ధ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,68,710కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే పది గ్రాములకు ఏకంగా రూ.7,140 మేర పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,360కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే పది గ్రాములకు ఏకంగా రూ.6,530 మేర పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు పది వేల రూపాయల మేర పెరిగి ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. మార్చి తొలి వారానికి బంగారం ప్రస్తుత ధరతో పోల్చుకుంటే 15 శాతం మేర పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దాదాపు రూ.23 వేల నుంచి 25 వేల వరకు పెరగొచ్చు. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలో 10 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర తిరిగి రూ.2 లక్షలకు చేరువ అవుతుందని భావిస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం.. కిలో వెండి స్వల్ప కాలంలో ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.30 నుంచి 50 వేల వరకు పెరగొచ్చు. యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ధరల పెరుగుదల అంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వెండి తిరిగి తన చారిత్రాత్మక గరిష్ఠ స్థాయిలను దాటి రూ.4.2 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.








