బడుగుల ఆశాజ్యోతి, వామపక్ష ఉద్యమయోధుడు భూపతి నారాయణమూర్తి విగ్రహావిష్కరణ!*
– _ఘనంగా జరిగిన బహిరంగ సభ, నివాళులర్పించిన సర్వమత గురువులు_
మలికిపురం: మలికిపురంలోని భూపతి వారి పేటలో స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు శ్రీ భూపతి నారాయణమూర్తి గారి శిలా విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ విగ్రహాన్ని నారాయణమూర్తి గారి కుమార్తె శ్రీమతి జెన్నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సర్వమత గురువులు హాజరై సామరస్యాన్ని చాటారు. బౌద్ధ మత గురువు బోధిహీన్, క్రైస్తవ మత గురువు థామస్ పల్లి ధానమ్, ముస్లిం మత గురువు సయ్యద్ షాబా తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వక్తలు నారాయణమూర్తి గారి సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శనం గారు మాట్లాడుతూ… “సామాజిక ఆస్తి అయిన భూపతి నారాయణమూర్తి గారి ఆశయాలను, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఎంతైనా ఉంది” అని హితవు పలికారు.
శ్రీమతి కందికట్ల లత గారు ప్రసంగిస్తూ… నారాయణమూర్తి గారి వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులు, అల్లకల్లోలాల మధ్య సాగినప్పటికీ, బడుగు, బలహీన వర్గాల బతుకులు మాత్రం అల్లకల్లోలం కాకూడదనే దృఢ నిశ్చయంతో ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారి శ్రేయస్సు కోసం పోరాడారని కొనియాడారు. ఆయన పోరాట విశేషాలను ప్రస్తుత సమకాలీన సామాజిక విషయాలతో జోడించి సభికులకు వివరించారు.
ఈ సభలో బీఎస్పీ నాయకులు బత్తుల లక్ష్మణరావు, మానవ హక్కుల వేదిక నుండి వి.ఎస్.ఎన్ కృష్ణ; ఏ.పి దళిత సోషల్ వాచ్ నుండి మాకా రాజేంద్రన్ తదితరులు పాల్గొని ఆయన జీవిత విశేషాలను, ఉద్యమ స్ఫూర్తిని వివరించారు.
ఈ సమావేశానికి శ్రీ గెడ్డం తులసి భాస్కర్ గారు ఆహ్వానం పలుకగా; స్థానిక సర్పంచ్ గెడ్డం రాజ్యలక్ష్మి తులసి భాస్కర్ గారు అధ్యక్షత వహించారు. చివరగా భూపతి నారాయణమూర్తి గారి మనవలు పోతుల శేఖర్ మరియు అమర్ లు సభకు విచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.







