మత్తులో మంటగలిసిన మాతృత్వం.
* మద్యం మత్తులో రెండు నెలల శిశువును వదిలేసిన కన్నతల్లి.
* రాత్రి ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో అమానవీయ ఘటన.
* స్పందించి చిన్నారిని రక్షించిన పోలీసులు.
* హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది.
* శిశుగృహకు బిడ్డ, రిమ్స్ ఆస్పత్రికి తల్లి తరలింపు.
ఆదిలాబాద్,మహా.
మద్యం మత్తు ఓ కన్నతల్లితో దారుణానికి ఒడిగట్టేలా చేసింది. నవమాసాలు మోసి కన్న పేగుబంధాన్ని సైతం మర్చిపోయేలా చేసింది. పాలుతాగే పసికందును నడిరోడ్డుపై వదిలేసిందో కఠినాత్మురాలు. చూసేవారి మనసులను కలచివేస్తున్న ఈ హృదయ విదారక ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ.. తన రెండు నెలల చిన్నారిని రోడ్డుపైనే వదిలేసి అపస్మారక స్థితికి చేరుకుంది. చలిలో అనాథలా పడి ఉన్న ఆ పసికందును గమనించిన స్థానికులు, బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు.
అమాంతం ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుని లాలించిన పోలీసులు.. తక్షణమే చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది ‘బాల్ రక్షక్’ వాహనంలో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం, సురక్షితంగా రక్షించి శిశు గృహకు అప్పగించారు. మరోవైపు, పీకలదాకా మద్యం సేవించి రోడ్డుపైనే స్పృహ కోల్పోయి ఉన్న ఆ తల్లిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సదరు మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాతే ఈ దారుణానికి గల పూర్తి కారణాలు, వారి స్వస్థలం, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు తెలియవచ్చని పోలీసులు వెల్లడించారు. పాలుతాగే వయసున్న ఆ పసికందు పడుతున్న అవస్థను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.





