Mahaa Daily Exclusive

  మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Share

మతం మారితే ఎస్సీ హక్కులు దూరం!
* క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ హోదా, ప్రయోజనాలు దక్కవని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు.
* ఎస్సీల మతమార్పిడి అనంతరం హక్కుల కల్పనపై కీలక తీర్పు.
* ఈ వ్యవహారంలో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం.
* దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అమలులో అత్యంత కీలకం కానున్న తాజా తీర్పు.

ఢిల్లీ, మహా.

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మతమార్పిడి, ఆ తర్వాత వారికి దక్కే రిజర్వేషన్ల హక్కులపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు ఇకపై ఎస్సీల కింద ఎలాంటి హక్కులు, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందలేరని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. మతం మారిన దళితులకు రిజర్వేషన్ల వర్తింపునకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టమైన తీర్పునిచ్చింది. మతమార్పిడి తర్వాత కూడా పాత కులం ఆధారంగా ఎస్సీ సామాజిక వర్గానికి కల్పించే విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు లేదా ఇతర చట్టపరమైన ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. హిందూ మతంలో అంటరానితనం, సామాజిక వివక్షను ఎదుర్కొన్న వర్గాల అభ్యున్నతి కోసమే ఎస్సీ కోటా ఉద్దేశించబడిందని, సామాజిక వివక్షకు తావులేదనే క్రైస్తవం లాంటి మతాల్లోకి మారిన తర్వాత ఆ ప్రయోజనాలను ఆశించడం సబబు కాదన్న రాజ్యాంగ స్ఫూర్తిని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. తాజా తీర్పుతో మతం మారిన వారికి రిజర్వేషన్ల వర్తింపుపై ఉన్న సందిగ్ధతకు దాదాపుగా తెరపడినట్లయింది.
ఈ వ్యవహారంలో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. మతం మారిన వ్యక్తులకు ఎస్సీ హోదా వర్తించదంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉందని స్పష్టం చేసింది. అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని తేల్చిచెబుతూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో క్రైస్తవ మతం స్వీకరించిన వారు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందడానికి, తద్వారా కోటా ప్రయోజనాలు అనుభవించడానికి అనర్హులుగా మారనున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టత భవిష్యత్తులో రిజర్వేషన్ల అమలులో, లబ్ధిదారుల ఎంపికలో అత్యంత కీలకంగా మారనుంది.

Latest